. . . మజ్దూర్ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాపెల్లి శ్రీనివాస్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
తెలంగాణ రాష్ట్రంలో బీడీ కార్మికుల పిల్లలకు అందించే ఆన్‌లైన్ స్కాలర్షిప్ దరఖాస్తుల నమోదును వంద శాతం పూర్తి చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మజ్దూర్ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాపెల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బీడీ కంపెనీల యాజమాన్యాలు, కమిషన్ దారులు, బీడీ కార్మిక సంఘాల నాయకులు సమన్వయంతో పనిచేసి అర్హులైన ప్రతి బీడీ కార్మికుడి పిల్లలకు స్కాలర్షిప్ నమోదు జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అందిస్తున్న బీడీ కార్మికుల పిల్లల స్కాలర్షిప్‌లకు విధించిన వార్షిక ఆదాయ పరిమితి రూ.1.20 లక్షల నిబంధనను తొలగించాలని కోరుతూ గురువారం హైదరాబాద్‌లోని లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వెల్ఫేర్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. అదే విధంగా శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీడీ వెల్ఫేర్ హాస్పిటల్ డిస్పెన్సరీలో వైద్యాధికారి డాక్టర్ మహేష్ బాబుకు మరో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాపెల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, బీడీ వెల్ఫేర్ ఆసుపత్రులు, డిస్పెన్సరీల ద్వారా ప్రతి బీడీ కార్మికుడికి డిజిటల్ హెల్త్ కార్డు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అన్ని రకాల మందులను డిస్పెన్సరీల్లో అందుబాటులో ఉంచడంతో పాటు ప్రతి కేంద్రంలో మెడికల్ ఆఫీసర్, నర్సులు, ఇతర సిబ్బందిని నియమించాలని కేంద్ర ప్రభుత్వాన్ని లేఖ ద్వారా కోరినట్లు తెలిపారు. టీబీ, క్యాన్సర్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరించేలా ప్రత్యేక పథకాలు అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని బీడీ కార్మికులకు సంచార వైద్యశాలల ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించాలని, తెలంగాణ రాష్ట్రంలోని బీడీ కార్మికుల కోసం 500 పడకల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం అమలులో ఉన్న బీడీ కార్మికుల పిల్లల స్కాలర్షిప్‌ల మొత్తాన్ని పెంచాలని కూడా వెల్ఫేర్ కమిషనర్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ లేబర్ (న్యూఢిల్లీ)లకు వినతిపత్రాలు సమర్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బీడీ కార్మికులు పాల్గొన్నారు.
