నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : బాపూజీ వచనాలయ భూములను కాపాడాలని బాపూజీ వచనాలయ పోరాట పరిరక్షణ సమితి కన్వినర్ కోనేరు సాయికుమార్ అన్నారు. నగరంలోని లలిత మాల్ థియేటర్ వద్ద గల బాపూజీ వచనాలయ పోరాట పరిరక్షణ సమితి కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్వీనర్ కోనేరు సాయికుమార్ మాట్లాడుతూ బాపూజీ వచనాలయ ఎన్నికల్లో పాలకవర్గం అనేక అవకతవకలకు పాల్పడిందని అన్నారు. సభ్యత రుసుం రూ.3700 చేసి ఎన్నికల్లో పోటీ చేయకుండా అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారికి ఐదు సంవత్సరాలు ఉండాలని ఉపాధ్యక్ష సహాయ కార్యదర్శి కార్యవర్గ సభ్యులకు రెండు సంవత్సరాలు ఉండాలని తీర్మానం చేశామని చెప్పడం మోసమని తెలిపారు. అసలు బైలాసులో ఇది లేదని ఈ పాలకవర్గం అడ్డం పెట్టుకొని అధ్యక్షులు భక్తవత్సలం అలియాస్ ఢిల్లీ ఉత్తుత్తి తీర్మానాలు చేశారని అన్నారు. జిల్లా నడిబొడ్డులో ఉన్న ఈ స్థలాన్ని కాజేయడానికి ఈ తీర్మానాల పేరుతో ఎవరిని పోటీ చేయించలేదని తెలిపారు. వారి కుటుంబాల్లోనే 200 లోపల ఓట్లను నమోదు చేసుకొని నాటకాలు ఆడుతున్నారని అన్నారు. జిల్లా రిజిస్టర్ కు కలెక్టర్ రాసిన లెటర్ కు సమాధానమిస్తూ జిల్లా రిజిస్టర్ మాకు ఇచ్చిన కాపీలో బాపూజీ వచనాలయం పేరుతో ఎలాంటి రిజిస్ట్రేషన్ మా వద్ద లేదని ఆ సంస్థ ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా మాతో చేయడం లేదని చెప్పడం చూస్తుంటే మేము చెప్పింది అక్షరాలా నిజమైందని అన్నారు. ఈ సమావేశంలో సభ్యులు, సామాజిక కార్యకర్త బంగారు సాయిలు, సిద్ధం రాజేందర్, అన్వర్ ఖాన్ రత్నాకర్ పాల్గొన్నారు.
