- ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో కోతలు
- ఏజెన్సీ మార్పిడితోనే ఇక్కట్లు అంటున్న యాజమాన్యం
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులకు ఏప్రిల్ నెల వేతనాల్లో కోతలు కలకలం రేపింది. ఈ నెల మొదటి వారంలో వేతనాలు జమ కావడంతో ఆనందపడాలో కోతలు రావడంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కలవరానికి కారణమైంది. గత ప్రభుత్వంలో వివాదాస్పదంగా జరిగిన 330 ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గడిచిన మాసానికి సంబంధించిన వేతనాలను ఈ నెల మొదటి వారంలో జమ చేశారు. అయితే అందులో కొందరి వేతనాల్లో కోతలు రావడంతో వారు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయంపై జవాన్లను, ఎస్సైలను అడిగినా తమకేమి సంబంధం లేదని అంతా అధికారులే చూసుకుంటారని చెప్పడంతో వారు అయోమయానికి గురయ్యారు. సాధారణంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ.14,520 వేతనాలు రావాల్సి ఉండగా రూ.2 వేల నుంచి 4 వేల వరకు తక్కువగా జమ అయ్యాయి. అయితే బల్ధియాలో గత ప్రభుత్వ హయంలో జరిగిన నియామకాల్లో దాదాపు సగానికి పైగా పారిశుధ్ద్య కార్మికులుగా విధులు నిర్వహించడం లేదని అందువల్లే వారికి అటెండెన్స్ లేదనే ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వ హయంలో నియామితులైన ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను అప్పటి కార్పొరేటర్లు లక్షా నుంచి 2 లక్షల వరకు బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నారు. పారిశుద్య పనుల కోసం నియామకాలు జరిగినా ఆనాడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని వారికి పారిశుధ్ద్యేతర పనులలో నియమించారు. అయితే గత కొంత కాలంగా ఈ విషయంలో వివాదాలు తలెత్తుతున్నాయి. మొన్నటి వరకు కేఎన్ఆర్ గ్రూప్ వారి ఆధ్వర్యంలోనే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా వేతనాలు అందించేవారు. గత నెలలో కార్తీకేయ ఏజెన్సీకి సంబంధిత వేతనాల పంపిణీ బాధ్యతను అప్పగించారు. అయితే కార్పొరేషన్ లో జవాన్లు తర్వాత సానిటరి ఇన్స్ పెక్టర్లే డ్రాయింగ్ ఆఫీసర్లుగా అటెండెన్స్ వేసి కార్యాలయానికి పంపితే వేతనాలు జమ చేయడంలో కొత్త ఏజెన్సీ పొరపాట్లతో ఈ పరిస్థితి తలెత్తిందని సమాచారం. ఈ వివాదాన్ని త్వరలోనే పరిష్కరిస్తామని కార్తీకేయ ఏజెన్సీ నిర్వాహకులు తెలిపారు. అయితే ఇదే విషయంపై బతుకమ్మ నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ ను వివరణ కోరేందుకు యత్నించగా ఆయన స్పందించలేదు.