ఆర్మూర్, బతుకమ్మ :
ఆర్మూర్ పట్టణంలోని మైనారిటీ ఉర్దూ మీడియం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో గత పదేళ్లకు పైగా మైనారిటీ విద్యార్థినులకు బోధన చేస్తున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇప్పటి వరకు వేతనాలు చెల్లించకపోవడం అత్యంత బాధాకరమని విద్యార్థి సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలకు తగిన గుర్తింపు ఇవ్వడంతో పాటు, వారికి పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షణమే విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారికి విద్యార్థి సంఘాల ప్రతినిధులు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు షాహిద్, యూఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు సిద్ధాల నాగరాజు మాట్లాడుతూ, మైనారిటీ విద్యార్థినుల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించి, వారి వేతనాలను విడుదల చేయాలని ఎమ్మెల్యే ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు వారు తెలిపారు.
