. . . అధికారులనే టార్గెట్ చేసిన ఎమ్మెల్యే
. . . అధికారులు ఉక్కిరిబిక్కిరి
. . . కామారెడ్డి జిల్లా యంత్రాంగంలో కలకలం
కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లాలో శుక్రవారం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంత్ రావు హౌజింగ్ అధికారులను టార్గెట్ చేయడం కలకలం రేపింది. జిల్లాలో ప్రధానంగా తన నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం నత్తనడకన నడుస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్ళలో 9 శాతం ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం పూర్తయిందని, 90 శాతం పూర్తి కావడానికి ఎన్నేళ్ళు పడుతుందని అధికారులపై మండిపడ్డారు. 3 వేల ఇళ్ళ మంజూరి జరిగితే మరో రెండేళ్ళలో ఎంత వరకు పూర్తవుతాయని అధికారులను నిలదీసిన వైనం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి కావాల్సిన ఇసుక మొరం తెచ్చుకుంటున్న లబ్దిదారులపై కేసులు నమోదు చేస్తూ ఇసుక అక్రమ రవాణాదారులకు మాత్రం వదిలేస్తున్నారని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణంలో లబ్దిదారుల విషయంలో మానవత దృక్పతంతో వదిలేయాలని పోలీసు అధికారులను కోరినప్పటికీ కేసులు పెట్టడం శోచనీయామన్నారు. అధికారులు తమ విధుల విషయంలో ఒక్క నిమిషం కూడా ఎక్కువ పని చేయనప్పటికీ ప్రజలు సంతృప్తి చెందేలా పని చేయాలని వ్యాఖ్యలు చేశారు. గరీబోళ్ళు ప్రజల సమస్యలపై మాట్లాడితే కాంట్రవర్సీ అనుకుంటే తాను రోజు కాంట్రవర్సీలు మాట్లాడుతానని చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
ఇటీవల బాన్సువాడ డివిజన్ లో ఆర్డీవో కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు అధికార యంత్రాంగం సాక్షిగా పోలీసు అధికారులను టార్గెట్ చేశారు. జుక్కల్ నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణాదారులను పోలీసులు వదిలేస్తున్నారని, ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులపై కేసులు పెడుతున్నారని చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. వేదికపై ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు ఉండగానే ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బిచ్కుంద, బీర్కూర్ ల నుంచి ఇసుకను తరలించారు. అయితే ఆనాడు అధికార పార్టీ పెద్దల అండతో ఇసుకను తరలించారు. స్థానిక ప్రజాప్రతినిధులకు సంబంధం లేకుండా ఇతర ప్రాంతాల కాంగ్రెస్ పెద్దల పెత్తనం ఏమిటని ఇసుక పంచాయితీ ముఖ్యమంత్రి వద్దకు చేరింది. ఆనాడు ఈ వ్యవహరం బయటకు పొక్కకుండానే లోలోపల సద్దుమనిపించారు. ఆనాడు కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ రావే ఇసుక తవ్వకాలు, రవాణాపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్ల పేరిట మంజూరైన ఇసుక తవ్వకాల విషయంలో ఆంక్షలపై ఎమ్మెల్యే గళమెత్తడం కామారెడ్డి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
మంజిరా నుంచి ఇసుక అక్రమంగా తరలుతుందనేది జగమెరిగిన సత్యం. ప్రధానంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలో మంజిరా పరివాహక ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఇసుక రీచ్ లకు ప్రభుత్వం అనుమతిచ్చింది. నిజామాబాద్ జిల్లాలో పోతంగల్, సాలురాలో ఉన్న ఇసుక రీచ్ ల నుంచి ఇందిరమ్మ ఇళ్ళకు రవాణాకు అనుమతి ఉంది. స్థానిక తహసీల్ధార్ ద్వారా ఇందిరమ్మ ఇళ్ళ కోసమని ఇసుక తవ్వకాలకు, రవాణాకు అనుమతి తీసుకుని కొందరు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అంతేగాకుండా మంజిరా పరివాహక ప్రాంతమైన తెలంగాణ నుంచి ఇసుకను తోడి మహారాష్ట్ర, కర్ణాటకకు తరలిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పోతంగల్ మీదుగా మహారాష్ట్రకు, కర్ణాటకకు ఇసుక తరలింపు కామారెడ్డి జిల్లా మీదుగానే ఉండడంతో ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ రావు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. గత ప్రభుత్వ హయంలో ఇసుక తవ్వకాలు అంతా అధికార పార్టీ నాయకుల కనుసన్నుల్లోనే జరిగింది. ప్రస్తుతం ఇసుక లభ్యత, భూగర్భ జలాలను పరిగణలోకి తీసుకుని కేవలం ఇసుక రీచ్ లకు మాత్రమే అవి పట్టా భూముల్లో పరిమితికే ఇచ్చిన వాటిలోనే తవ్వకాలకు చేస్తున్నారు. కానీ ఇసుక మాత్రం అక్రమ రవాణా జరుగుతుండడంతో పోలీసు యంత్రాంగం చూసిచూడకుండా ఉంటూ అమాయకులైన పేదల ఇళ్ళ కోసం తరలిస్తే ట్రాక్టర్లను సీజ్ చేయడం, కేసులు నమోదు చేయడం ఏంటని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో జిల్లా అధికార యంత్రాంగం నోరుమెదపకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.