. . .ఆర్టీసీ డ్రైవర్ దుర్మరణం
. . . కండక్టర్ తో పాటు ప్రయాణికులకు గాయాలు
జుక్కల్, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా లో 161వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బిచ్కుంద వైపు వెళ్తున్న హైదరాబాద్-1 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జుక్కల్ మండలంలోని కౌలాస్ చౌరస్తాకు సమీపంలో అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు బోల్తా పడగా డ్రైవర్ డి. ఆంజనేయులు సీటు కింద చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందారు. కండక్టర్‌కు తీవ్ర గాయాలు కాగా పలువురు ప్రయాణికులు గాయపడ్డారు స్థానికులు మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి ముందు సుమారు 200 మీటర్ల దూరం నుంచే బస్సు అదుపుతప్పి వంకరగా వెళ్తుండటంతో ప్రయాణికులు భయంతో కేకలు వేసినట్లు ప్రత్యక్షంగా చూసిన వారు తెలిపారు.సమాచారం అందుకున్న పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. బస్సును పైకి లేపి డ్రైవర్ ఆంజనేయులు మృతదేహాన్ని బయటకు తీశారు. ప్రమాదంలో బస్సు బోల్తా పడటంతో పాటు ముందు రెండు టైర్లు విడిపోయాయి. ఘటనకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.

. . . బిచ్కుంద ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామార్శించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
జుక్కల్ చౌరస్తాలో జరిగిన ఆర్టిసి బస్సు ప్రమాదం పై స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతరావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన విషయం తెలిసిన వెంటనే కామారెడ్డి జల్లా కేంద్రంలో ఉన్న ఎమ్మెల్యే హుటా హుటిన బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి చెరుకుని క్షతగాత్రులను పరామార్శించారు.. ఘటన జరిగిన సమయంలోలో మొత్తం 13మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ మృతి చెందగా మరో 12 మంది గాయపడ్డారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారిలో ఒకరికి తలకు తీవ్ర గాయం కావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన క్షతగాత్రులకు బిచ్కుంద ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. బస్సు డ్రైవర్ మృతి తీవ్రంగా కలిచివేసింది క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

. . . జుక్కల్ ఎక్స్ రోడ్ వద్ద ఆర్టీసీ బస్ ప్రమాదంపై తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేసిన రవాణాశాఖ మంత్రి పోన్నం.
జుక్కల్ ఎక్స్ రోడ్ సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైన ఘటనపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఎండీ, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలు, ప్రస్తుతం పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో బస్సు డ్రైవర్ అంజనేయులు బస్సు కింద చిక్కుకుని మృతి చెందడం తనను తీవ్రంగా కలిచివేసిందని మంత్రి పేర్కొన్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే ఆర్‌ఎం నేతృత్వంలో అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించాలని, బాధితులకు అవసరమైన అన్ని విధాలుగా అండగా నిలవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.
