. . . మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఫోన్ లో సంభాషించిన ఎమ్మెల్యే లు
నిజామాబాద్, బతుకమ్మ:
నిజామాబాద్ జిల్లాలోని గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల పథకాల కింద ఉన్న ఆయకట్టు రైతులకు ఖరీఫ్ సీజన్‌లో సాగునీరు అందించేందుకు నీటి పారుదల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి చొరవతో నిజాంసాగర్ నుంచి గుత్పా, అలీసాగర్ లిఫ్ట్‌లకు నీటిని విడుదల చేసేందుకు శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.జిల్లాలో ప్రధానంగా వరి పంట సాగవుతుండగా, పంటలు కీలకమైన పొట్టదశలో ఉన్న నేపథ్యంలో సాగునీటి అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే భూపతి రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. గుత్పా, అలీసాగర్ ఎత్తిపోతల పథకాల పరిధిలోని ఆయకట్టుకు నిజాంసాగర్ నుంచే నీటిని విడుదల చేసి, రైతులకు సకాలంలో సాగునీరు అందించాలని మంత్రిని కోరారు. అలీసాగర్, గుత్పా లిఫ్ట్‌లకు ప్రతి 10 రోజులకు ఒకసారి నీటిని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం పంటలకు అత్యంత కీలకమైన దశ కావడంతో తక్షణమే నీటి విడుదల చేపట్టాలని వారు మంత్రిని కోరారు. వారి విజ్ఞప్తిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే స్పందించి, సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఎమ్మెల్యే భూపతి రెడ్డి తెలిపారు. ఈ మేరకు అలీసాగర్ ఆయకట్టు పరిధిలోని సుమారు 48 వేల ఎకరాలకు, గుత్పా ఆయకట్టు పరిధిలోని సుమారు 35 వేల ఎకరాలకు కలిపి 83 వేల పైచిలుకు ఎకరాలకు ప్రయోజనం చేకూరేలా నీటిని విడుదల చేయనున్నారు.రోజుకు 1,500 క్యూసెక్కుల చొప్పున 10 రోజుల పాటు నీటిని విడుదల చేసేందుకు నీటిపారుదల శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. దీంతో ఖరీఫ్‌లో సాగు చేస్తున్న వరి పంటకు అవసరమైన సమయంలో నీరు అందడంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
