26.1 C
Hyderabad

ఫారెస్ట్ అధికారి ఇంట్లో రూ.26 లక్షల నగదు చోరీ

Must read

📰 Generate e-Paper Clip

 

. . . మాజీ జడ్పీటీసీ సభ్యురాలి భర్తపై అనుమానం

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అటవీశాఖ అధికారికి చెందిన అద్దె ఇంట్లో రూ.26 లక్షల నగదు చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో మాజీ జడ్పీటీసీ సభ్యురాలి భర్త ప్రమేయం ఉన్నట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు, బాధితుడి ఫిర్యాదు ప్రకారం.. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్‌పూర్‌కు చెందిన అటవీశాఖ అధికారి గుడిమల్ల శ్రీనివాస్ కరీంనగర్ జిల్లా తీగలగుట్ట మణికేశ్వర నగర్‌లో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. ఇటీవల స్వగ్రామంలో ఉన్న వ్యవసాయ భూమిని విక్రయించి వచ్చిన రూ.26 లక్షల నగదును ఇంట్లోని బెడ్‌రూమ్ బీరువాలో భద్రపరిచినట్లు తెలిపారు. కొంతకాలం తర్వాత డబ్బు అవసరం రావడంతో బీరువా పరిశీలించగా తాళం ధ్వంసమై ఉండటంతో పాటు నగదు కనిపించలేదని గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. గతంలో తన ఇంట్లో ల్యాప్‌టాప్ చోరీ చేసిన వ్యక్తే ఈ చోరీకి పాల్పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అలాగే, గత నెలలో తన ఇంటికి వచ్చిన మంథని మాజీ జడ్పీటీసీ సభ్యురాలి భర్త తగరం శంకర్‌లాల్‌పై కూడా బాధితుడు అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో లభించిన ఆధారాల మేరకు శంకర్‌లాల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే, ఈ ఘటనలో మరెవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

More articles

Latest article