తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా సీఎం మాటలు
సీఎం మాటల వెనుక ఆక్రోశం, బాధ వేరే ఉంది
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, బతుకమ్మ : సీఎం రేవంత్ ఖజానాలోకి రూ.20 వేల కోట్లు చేరాయని ఆధారాలతో చెబుతున్ననని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా సీఎం రేవంత్ మాట్లాడారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. టీజీఐఐసీలో 1.75 లక్షల ఎకరాలను కేసీఆర్ అందుబాటులో ఉంచారని, ప్రభుత్వం ఆభూములను కుదవపెట్టే కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఇందుకోసం టీజీఐఐసీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారుస్తూ రహస్య జీవో ఇచ్చారని తెలిపారు. అన్ని భూములను స్టాక్ ఎక్స్ఛేంజ్ లో కుదవపెట్టి జీవో తీసుకొచ్చారన్నారు. కంచ గచ్చి బౌలి భూములను కుదువ పెట్టి రూ. 10 వేల కోట్లు అప్పు తెచ్చారని చెప్పారు. సీఎం రేవంత్ మాటల వెనుక ఆక్రోశం బాధ వేరే ఉందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.1.80 లక్షల కోట్లు అప్పులు చేసిందన్నారు. రూ.లక్ష కోట్లు ఎక్కడికి పోయాయని, పెద్ద కాంట్రాక్టర్లకు చెల్లించారని ఆరోపించారు. ప్రభుత్వం అప్పులు, వ్యయంపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పార్టీలో నాపై కొందరు దుష్ప్రచారం
తాను పార్టీ బలోపేతం కోసం పని చేస్తున్నానని, 47 నియోజకవర్గాల పర్యటనలో వచ్చిన అభిప్రాయాలే చెబుతన్నాన్నారు. పార్టీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోందన్నారు. పార్టీలో నాపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, నన్ను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తానని పేర్కొన్నారు. నాపై దుష్ప్రచారం విషయంలో పార్టీ స్పందిస్తుందని భావిస్తున్నానని కవిత తెలిపారు.
