. . . అడ్డుకున్న వాచ్ మెన్ ను కర్రతో దాడి, పరిస్థితి విషమం
. . . పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో పోస్ట్ ఆఫీస్
బాన్సువాడ, బతుకమ్మ :
బాన్సువాడ పట్టణంలో యథేచ్ఛగా దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. వరుస ఘటనలతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. పోలీస్ స్టేషన్‌కు అతి సమీపంలో ఉన్న పోస్ట్ ఆఫీస్‌ను లక్ష్యంగా చేసుకుని దొంగలు రాత్రి సమయంలో దాడికి దిగడం సంచలనంగా మారింది. పోస్టాఫీస్ బాన్సువాడ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉన్న పోస్ట్ ఆఫీస్‌లో సోమవారం అర్థరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న వాచ్మెన్ సాయిలు దొంగలను అడ్డుకునే ప్రయత్నం చేయగా, వారు కర్రలతో అతనిపై దాడి చేశారు. ఈ దాడిలో సాయిలు తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే రక్తస్రావంతో కుప్పకూలిపోయాడు. అనంతరం దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. అలజడిని గమనించిన స్థానికులు వెంటనే పోస్టాఫీస్కు చేరుకున్న అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన సాయిలును వెంటనే బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతనికి ప్రాథమిక చికిత్స అందించి తలకు కుట్లు వేశారు. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. రాత్రి వేళల్లో పోలీసు పహారా పెంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

