నిజామాబాద్, బతుకమ్మ : జిల్లాలో ఆర్వోబీ నిర్మాణ పనులు కొన్ని నెలల తర్వాత వేగం పుంజుకోనున్నాయి. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతో అర్సపల్లి, అడివి మామిడిపల్లి ఆర్వోబీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్య పద్ధతిలో మాధవ నగర్ ఆర్వోబీ పనులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మితమైనప్పటికీ, గత భారాస ప్రభుత్వ హయాంలో ఆర్వోబీల నిర్మాణాలు నత్త నడకన కొనసాగాయి. గత ప్రభుత్వం ఈ నిధులను, దారి మళ్లించిందని భారతీయ జనతా పార్టీ నాయకులు పదేపదే ఆరోపణలు చేశారు. రాష్ట్ర ఆర్ అండ్ బీ మంత్రిగా జిల్లాకు చెందిన ప్రశాంత్ రెడ్డి ఉన్నప్పటికీ పనులు ముందర పడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని రోజులు నడిచిన పనులు, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నిధుల విడుదలలో జాప్యం ఏర్పడింది. దాంతో చేసేదేమి లేక గుత్తేదారులు కూడా పనులు చేయలేక కాలయాపన జరిగింది. జిల్లా వాసుల దశాబ్దాల కలయిన మాధవ్ నగర్ ఆర్వోబీ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎంపీ అర్వింద్ పనులను వేగవంతం చేయాలని తరచూ సమీక్షల్లో అటు అధికారులను ఇటు గుత్తేదారుల మీద ఒత్తిడి పెంచారు. నిధులు విడుదల చేయాలని గత సంవత్సరం డిసెంబర్ లో నేరుగా సీఎం రేవంత్ రెడ్డినే కలిసి, నిధులు విడుదల చేయాల్సిందేనని పట్టుపట్టారు. సీఎం ని ఎంపీ అర్వింద్ కలిసిన తర్వాత నిధులు విడుదల అవ్వడంతో అప్పట్లో కొన్ని నెలలు పనులు కొనసాగాయి. నిధుల విడుదలైన తర్వాత చేసిన పనులకు బిల్లులకు సంబంధించి, నెలల తరబడి పెండింగ్లో ఉండడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఓ మీడియా సమావేశంలో పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ గౌడ్ నిధులు కేంద్రం వద్దే పెండింగ్లో ఉన్నాయని అనడం ఎంపీ అర్వింద్ కు ఆగ్రహం తెప్పించింది. కొద్ది రోజుల్లోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎంపీ అర్వింద్ తేదీలతో సహా రాష్ట్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్న విషయాన్ని కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో నిధులు విడుదల చేయాల్సిందేనని, లేనిపక్షంలో తానే నిరాహార దీక్షకు సైతం దిగుతానని అల్టిమేటం ప్రకటించారు. గత నెల 29వ తేదీన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కని సైతం కలిసిన ఎంపీ అర్వింద్ నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు. మంత్రి భట్టి సైతం త్వరలోనే నిధులు విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. తాజాగా గత పది రోజుల క్రితం మధు నగర్ ఆర్వోబీకి రూ. 3.15 కోట్లు, అర్సపల్లి ఆర్వోబీకి రూ. 7.46 కోట్లు, అడివి మామిడిపల్లి ఆర్వోబీకి రూ. 3 కోట్లు నిధులు విడుదల కావడంతో కాంట్రాక్టర్లు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో గత కొన్ని నెలలుగా నిలిచిపోయినా ఆర్వోబీల పనులు తిరిగి వారం నుంచి కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మాధవ్ నగర్ వద్ద నిజామాబాద్ వైపు సర్వీస్ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. అటు అడవి మామిడిపల్లి బీటీ రోడ్డు పనులు సైతం నేడో రేపో ప్రారంభం కానున్నట్లు అధికారులు
తెలిపారు. వారం నుంచి పది రోజుల్లో పనులు పూర్తి చేయాలని ప్రణాళికలు రూపొందించారు. కాగా పనుల ప్రారంభంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నారు.


