. . . నిజామాబాద్ జిల్లాలో మానాల ఎన్ కౌంటర్ తర్వాత మొదటిది
. . . ఆనాడు అన్నలు . . . నేడు రౌడిషీటర్
నిజామాబాద్, బతుకమ్మ :
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో తొలి ఎన్ కౌంటర్ రియాజ్ దే. ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా నిజామాబాద్ జిల్లాలోని మానాలలో 2004లో ఎన్ కౌంటర్ జరిగింది. ఆనాడు వైఎస్ ప్రభుత్వం మావోయిస్టులతో చర్చల ప్రక్రియ జరిపిన తర్వాత దానిని విఘాతం కలిగిస్తూ జరిగిన ఎన్ కౌంటర్ ఇందూర్ లోనే జరిగింది. ఆనాటి ఎన్ కౌంటర్ లో నిజామాబాద్ జిల్లా కార్యదర్శి గంగుల రమేష్ ఆలియాస్ కంకణాల రాజిరెడ్డితో పాటు మరో 13 మంది అసువులు బాసారు. ఆనాటి తర్వాత నిజామాబాద్ జిల్లాలో మావోయిస్టుల ఉనికే లేకుండాపోయింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత వెటర్నరి వైద్యురాలు దిశ పై అఘాయిత్యం, హత్య తర్వాత తొలి ఎన్ కౌంటర్ జరిగింది. అందులో నలుగురిని ప్రస్తుత హైదరాబాద్ కమిషనర్ సజ్జనర్ ఆధ్వర్యంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఆ ఎన్ కౌంటర్ లో నలుగురు చనిపోగా ప్రస్తుతం కూడా సంబంధిత కేసు కొనసాగుతునే ఉంది. తర్వాత పోలీసులకు మోస్ట్ వాంటెండ్ గా ఉన్న నయింను పోలీసులు ఎన్ కౌంటర్ లో లేపేశారు. అనంతరం ఐఎస్ఐ ప్రేరేపిత సంస్థల్లో పని చేసిన వికారుద్దీన్ ను వరంగల్ జిల్లా జనగాం వద్ద ఎన్ కౌంటర్ లో కాల్చి చంపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దశాబ్ధాల కాలం తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హయంలో మొదటి ఎన్ కౌంటర్ నిజామాబాద్ జిల్లాలో రియాజ్ దే అని చెప్పాలి. సీసీఎస్ కానిస్టేబుల్ ను హతమార్చి ఇద్దరి పోలీసులను గాయపర్చిన రియాజ్ ను ఎన్ కౌంటర్ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానిస్టేబుల్ ను కత్తితో పొడిచి హత్య చేసిన తర్వాత రియాజ్ పరారీ కాగా 8 టీంలతో గాలింపు చర్యలు చేపట్టారు. కానిస్టేబుల్ హత్య జరిగిన 48 గంటల తర్వాత కానీ రియాజ్ ఆచూకీ దొరకలేదు. రియాజ్ ను నిజామాబాద్ జిల్లాలో అరెస్టు చేయడంతో రిమాండ్ కు పంపుతారనే ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా రియాజ్ ను పట్టుబడిన సమయంలోనే గాయాలు ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. అక్కడ రియాజ్ పోలీసులపైకి ఎదురు తిరిగి వారు జరిపిన ఆత్మరక్షణ కాల్పుల్లో హతమవ్వడం కలకలం రేపింది.
నిజామాబాద్ జిల్లాలో నక్సల్స్ కదలికలు తగ్గిపోతున్న తరుణంలో ఐఎస్ఐ ప్రేరేపిత తీవ్రవాదులకు ఇందూర్ అడ్డాగా మారింది. నిజామాబాద్ ను అడ్డాగా చేసుకుని కార్యకలాపాలు నిర్వహించిన అజాంఘోరిని నిజామాబాద్ జిల్లా సరిహద్దులోని నేటి జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద పోలీసులు ఎన్ కౌంటర్ లో హతమార్చారు. ఆ తర్వాత జిల్లాలో మావోయిస్టు పార్టీ కనుమరుగు కాగా ఐఎస్ఐ, పీఎఫ్ఐ, ఇతర నిషేదిత సంస్థల సంబంధించిన వ్యక్తుల కదలికలు పెరిగాయి. జిల్లాలో రౌడిషీటర్లు, గంజాయి స్మగ్లర్లు, పీడీఎస్ బియ్యం స్మగ్లర్ల వద్ద తుపాకులు చేరాయి. జిల్లాలో కంట్రిమేడ్ తుపాకులను స్వాధీనం చేసుకున్న ఘటనలు ఉన్నాయి. రౌడిషీటర్లు మహారాష్ట్ర , బీహార్ నుంచి తుపాకులు తీసుకువచ్చి బెదిరిస్తున్న దాఖలాలున్నాయి. ఇటీవల జిల్లాలో పలువురు రౌడిషీటర్లను అదుపులోకి తీసుకున్నప్పుడు కూడా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతానికి కత్తులు, కటారులతో రౌడిషీటర్లు హల్ చల్ చేస్తుండగా రియాజ్ ఎన్ కౌంటర్ తో అందరిలో భయం మొదలయింది. పోలీసులు నేరగాళ్ళను వదలరనే సంకేతాన్ని ఇచ్చినట్లయింది.
