27.5 C
Hyderabad
Friday, July 31, 2026

సమస్యల పరిష్కార వేదికలుగా రెవెన్యూ సదస్సులు

Must read

📰 Generate e-Paper Clip

  • కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

 

నిజామాబాద్, బతుకమ్మ : రెవెన్యూ సంబంధిత భూ సమస్యల పరిష్కారానికి భూభారతి రెవెన్యూ సదస్సులు వేదికలుగా నిలువాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. రుద్రూర్ మండలం రాణంపల్లి, సాలూర మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులను కలెక్టర్ సందర్శించారు. అర్జీదారుల సమస్యలను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, వాటిని ఆన్లైన్ లో నమోదు చేస్తున్నారా? అని అధికారులను ఆరా తీశారు. వివరాల నమోదులో తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. స్వీకరించిన దరఖాస్తులకు రసీదులు అందించాలని, సంబంధిత రిజిస్టర్లలో వివరాలు రాయాలని ఆదేశించారు. దరఖాస్తుల స్వీకరణ, హెల్ప్‌డెస్క్ లను, రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. సమస్యల వారీగా అర్జీలను   విభజిస్తూ, పక్కాగా రికార్డులను పొందుపర్చాలని అన్నారు. తహసీల్దార్ స్థాయిలో పరిష్కరించదగిన దరఖాస్తులను వెంటనే  పరిష్కరించాలని అన్నారు. జూన్ 20వ తేదీ వరకు అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నామని, భూ సమస్యలున్న ప్రజలు ఈ సదస్సులకు హాజరై దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. సదస్సులలో ప్రజలు సమర్పించే ప్రతి దరఖాస్తును స్వీకరించాలని, సానుకూలంగా ఉన్న సమస్యలను సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించాలని సూచించారు. ఒకవేళ సమస్యను పరిష్కరించేందుకు నిబంధనలు అంగీకరించని పక్షంలో దరఖాస్తుదారుడికి ఆ విషయాన్ని స్పష్టంగా అర్ధమయ్యే రీతిలో తెలియజేయాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దరఖాస్తుదారులను పదేపదే తిప్పుకోకూడదని, సదస్సులో అర్జీలు అందించేందుకు వచ్చే వారితో సున్నితంగా వ్యవహరించాలని రెవెన్యూ బృందాలకు హితవు పలికారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, పూర్తి రికార్డుల ఆధారంగానే వాటిని పరిష్కరించాలని సూచించారు. ఈ రెవెన్యూ సదస్సులు ముగిసిన మీదట క్షేత్రస్థాయిలో విచారణ జరపాల్సి ఉంటుందని, దీనిని దృష్టిలో పెట్టుకొని వివరాల నమోదులో తప్పిదాలకు తావు లేకుండా చూడాలన్నారు. అర్హులైన వారికి పూర్తి న్యాయం జరిగేలా సానుకూల దృక్పథంతో పని చేయాలని, అప్పుడే భూభారతి రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సార్థకత చేకూరి, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని కలెక్టర్ అన్నారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, సంబంధిత రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Revenue conferences as problem-solving platforms

More articles

Latest article