- 42% బీసీ రిజర్వేషన్ బిల్లు పిటిషన్ డిస్మిస్
- స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు
నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : 42% బీసీ రిజర్వేషన్ల అమలు కై తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.9 పై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. అత్యున్నత న్యాయస్థానం స్పెషల్ లీవ్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. హైకోర్టులో ఈ అంశం పెండింగ్‌లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని తేల్చి చెప్పింది. కావాలనుకుంటే పాత రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్లవచ్చని స్పష్టం చేసింది. రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు జీవోపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ అంశంపై తక్షణమే జోక్యం చేసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. రిజర్వేషన్లు 50శాతం మించొద్దనే అభిప్రాయం సరికాదని కోర్టుకు వివరించారు. ఇందిరా సహానీ కేసులోనూ 50శాతం పరమితి దాటొచ్చని ఉందని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా తెలంగాణలో కులగణన సర్వే జరిగిందని అన్నారు. ప్రభుత్వం ఇంటింటి సర్వే చేసి లెక్క తేల్చిందని అభిషేక్ సింఘ్వీ న్యాయస్థానానికి వివరించారు. రిజర్వేషన్ల పెంపుపై తెలంగాణ అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయని, 3 నెలలు దాటినా బిల్లుపై గవర్నర్ నిర్ణయం తీసుకోలేదని వాదించారు. 3 నెలల్లో నిర్ణయం తీసుకోకపోతే బిల్లు ఆమోదం పొందినట్టేనని సుప్రీం చెప్పిందని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం బిల్లు చట్టంగా మారినట్టేనని వాదనలు బలంగా వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం గురువారం పిటిషన్ ను డిస్మిస్ చేసింది. కాగా, రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అమలు జీవోపై హైకోర్టు 6వారాల స్టే ఇవ్వడాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో సవాలు చేసినప్పటికీ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించలేదు. మరోపక్క ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సమావేశం నిర్వహిస్తోంది. దీంతో రేవంత్ సర్కార్ బిసి 42% రిజర్వేషన్లపై తదుపరి ఏ నిర్ణయం తీసుకోనుందనే ఆసక్తి నెలకొంది.
