బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సమీర్ అహ్మద్, మైనారిటీ విభాగం అధ్యక్షుడు అజరుద్దీన్ మంగళవారం అదనపు కమిషనర్ ను కలిసి 42వ వార్డులోని చంద్రశేఖర్ కాలనీలో నెలకొన్న సమస్యలపై వినతిపత్రాన్ని అందజేశారు. చంద్రశేఖర్ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడం, రోడ్లు అత్యంత అధ్వాన్నంగా మారడం వల్ల స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సందర్భంగా అదనపు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. కాలనీలో మురుగునీరు రోడ్లపైకి చేరుకుని, దుర్వాసనతో పాటు దోమలు, అంటువ్యాధులు పెరిగేందుకు కారణమవుతోందని వివరించారు. రోడ్లు పూర్తిగా గుంతలమయమై, వర్షాకాలంలో మరింతగా పాడైపోతున్నాయని, దీనివల్ల ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్యలను తక్షణమే గుర్తించి, మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో త్వరగా కొత్త డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టాలని పాడైన రోడ్లను పునరుద్ధరించాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక ప్రజల పక్షాన సమస్యల పరిష్కారానికి తమ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.
