- సొంత జిల్లాకు బదిలీకి ప్రభుత్వం అంగీకారం
- 317 జిఓ ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీలకు మార్గదర్శకాలు
- క్యాబినేట్ సబ్ కమిటీ సిపారసుల కోసం 243,244,245 జిఓల విడుదల
హైద్రాబాద్, బతుకమ్మ: రాష్ట్రంలో జీవో 317 జీవో ఉత్తర్వుల కారణంగా నష్టపోయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఊరట లభించింది. ఈ జీవో అమలుతో ఇబ్బందిపడిన భార్యాభర్తలు, మ్యూచువల్, అనారోగ్యం కారణాలున్న ఉద్యోగుల బదిలీకి సంబంధించిన దస్త్రంపై సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేశారు. ప్రభుత్వం జీవో 317పై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించగా ఆ సంఘం స్పౌజ్, మ్యూచువల్, హెల్త్ గ్రౌండ్స్ వారికి బదిలీలు జరుపాలని కొద్ది రోజుల క్రితమే సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఆ దస్త్రాన్ని సీఎంకు పంపగా ఆయన శుక్రవారం ఆమోదించారు. దీనిపై జిఓ 243,244,245 ఉత్తర్వులను జిఎడి విడుదల చేసింది. జిఓ 243 స్పౌజ్ కేసులకు సంబందించిన, 244 మెడికల్ గ్రౌండ్ లో, 245 జిఓ మ్యూచువల్ కేటగిరిలో ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీకి మార్గధర్శకాలను రుపొందించారు. జిఓ 243 లొ భార్యాభర్తలు వేరువేరు క్యాడర్లో పని చేస్తున్నట్లయితే క్యాడర్ మార్పు కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులను ఎలా సర్దుబాటు చేయాలో మంత్రుల కమిటీ సిఫార్సులు చేసింది. దానికనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆయా డిపార్ట్మెంట్ల హెచ్ఓడిలకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఖాళీలకు క్యాడర్ మార్పుకు అనుమతించాలని ఈ మొత్తం ప్రక్రియను డిసెంబర్ 31 లోపు పూర్తిచేయాలని ఆదేశాలు ఇచ్చారు. సంబంధిత ప్రక్రియ చేస్తున్నప్పుడు ప్రస్తుతం క్యాడర్లో ఉన్న ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది కలుగరాదు అని ఆదేశాలు జారీ చేశారు. జిఓ 245 ప్రకారం పరస్పర బదిలీలు కోరుకునేవారు 01 డిసెంబర్ 2024 నుంచి 31 డిసెంబర్ 2024 వరకు జిఓ లొ ఇచ్చిన వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి. గైడ్లైన్స్ అన్ని కూడా పాతవే అమలుచేయనున్నారు. ఎలాంటి సర్వీస్ ప్రొటెక్షన్ లేదు అని ప్రకటించారు. పరస్పర బదిలీ కోరుకున్న ఉద్యోగులు, నూతన కేడర్లో చివర్లో ఉంటామని అండర్ టేకింగ్ ఇవ్వాలి. పరస్పర బదిలీ కోరుకున్న ఉద్యోగి ఆ జిల్లాలోఆ క్యాడర్లో చివరిలో ఉంటారు. జిఓ 244 ప్రకారం మెడికల్ గ్రౌండ్ లో క్యాన్సర్, న్యూరో సర్జరీ, కిడ్ని మార్పీడి, లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్, ఓపేన్ హర్ట్ సర్జరీ వారికి మాత్రమే అవకాశం ఉంది. ఈ బదిలీలు డిసెంబర్ లో పూర్తి కానున్నాయి. 317 జిఓ లో అత్యధికంగా 13 జిల్లాలకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు నష్ట పోయారు. పాత పది జిల్లాలతో పాటు హైద్రాబాద్ చుట్టు ప్రక్కల ప్రాంతాలకు చెందిన జిల్లాల వారు సొంత జిల్లాలకు బదిలీపై వెళ్లక నానా కష్టాలు పడ్డారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ప్రజా పాలన ప్రారంభమై ఏడాది గడిచిన సంధర్బంగా సంబరాల వేళ 317 జిఓ బాధితులకు ఉపశమన ఉత్తర్వులు ఇచ్చినట్లయింది. ప్రభుత్వ ఉద్యోగుల కంటే, ఉపాధ్యాయులకు ఈ జిఓలు రావడం వారిలో సంతోషాన్ని నింపింది.
