. . . నిజామాబాద్‌లో త్వరలో భారీ బహిరంగ సభ నిర్వహణకు తీర్మానం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థి ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్త కార్యాచరణ చేపట్టాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం నిర్ణయించింది. సంఘం రాష్ట్ర సమావేశంలో పలు కీలక తీర్మానాలను ఆమోదించారు. ఆదివారం నిర్వహించిన సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండల ప్రదీప్ మాట్లాడుతూ, విద్యార్థి ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు త్వరలో నిజామాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉద్యమకారులకు గౌరవప్రదమైన జీవనం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల ఇంటి స్థలం కేటాయించడంతో పాటు, కేటగిరీల వారీగా నెలకు రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు పెన్షన్ అందించాలని సమావేశం తీర్మానించింది. అలాగే ఉద్యమకారులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని కోరింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల అర్హతలను గుర్తించి, వారికి ప్రభుత్వం ప్రత్యేక జీవో ద్వారా శాశ్వత ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సంఘం ప్రతిపాదించింది. యూనివర్సిటీల్లో ఉద్యోగ నియామకాల్లో అవకాశాలు కల్పించడంతో పాటు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యమకారులకు ప్రత్యేక కోటా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. భవిష్యత్‌లో తెలంగాణ విద్యార్థులు రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం అయ్యేలా కార్యాచరణ రూపొందించాలని సమావేశం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విద్యార్థి ఉద్యమకారుల సన్నాహక సమావేశాలు, మీడియా సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు డా. పిడమర్తి రవి, డా. సాంబశివరావు గౌడ్, శంకర్ నాయక్, రాస వెంకట్, వేల్పుల కుమార్, డా. బీకోజీ, ధార్ధిక స్వప్న, వడ్డే ఎల్లన్న, గద్దల అంజిబాబు, తిరుమనపల్లి ప్రశాంత్, సంపత్, అల్లుడు జగన్, సంజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
