- పేర్లు చేర్చడానికి ఒక రేటు
- కొత్త రేషన్ కార్డులకు మరో రేటు
- తహసీల్ కార్యాలయం వద్ద దళారుల దందా
- మీ సేవా కేంద్రాల వద్ద ఏజెంట్లు
నిజామాబాద్, బతుకమ్మ :
దశాబ్ధ కాలంగా ఎదురు చూసిన కొత్త రేషన్ కార్డులకు తెలంగాణ ప్రభుత్వం పచ్చజండా ఊపిన విషయం తెలిసిందే. గతేడాది కొలువుదీరిన కొత్త ప్రభుత్వం అర్హులైన పేదలకు రేషన్ కార్డులు ఇస్తామని కొత్త వారిని రేషన్ కార్డులలో నమోదు చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దానికి అనుగుణంగా ప్రజాపాలనలో దరఖాస్తులను కూడా స్వీకరించారు. అయితే ప్రజాపాలనలో ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 90 వేలకు పైగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు రావడంతో అధికారులు ఆలోచనలో పడ్డారు. ముందుగా మీ సేవాల ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి అర్హులను గుర్తించి రేషన్ కార్డుల మంజూరి, అంతకుముందే పాత రేషన్ కార్డులలో పేర్ల నమోదు తొలగింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఇదే వ్యవహరం కొందరికీ కాసులు కురిపిస్తుంది. ప్రధానంగా రేషన్ కార్డుల కొరకు గత కొన్ని రోజులుగా వసూళ్ళ దందా జోరుగా సాగుతుంది.
రాష్ట్ర వ్యాప్తంగా జులై మాసంలో కొత్త రేషన్ కార్డుల మంజూరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో భాగంగా గత నెల నుంచి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ, పాత రేషన్ కార్డులలో పేర్ల నమోదు, తొలగింపు ప్రక్రియను అధికారికంగా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మీ సేవల వద్ద రూ.45 చెల్లించిన వారికి రేషన్ కార్డుల దరఖాస్తులు చేసుకునే ప్రక్రియ ప్రారంభమైంది. మీ సేవలలో దరఖాస్తు చేసుకున్న వారు స్థానిక రెవెన్యూ అధికారుల ద్వారా రేషన్ కార్డుల మంజూరి పరిశీలన కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పుడు ఈ వ్యవహరంలో దళారులు,ఏజంట్లు ప్రవేశించి పేదల వద్ద అందిన కాడికి దండుకుంటున్నారు. కొత్త రేషన్ కార్డుల మంజూరు బాధ్యత తమదేనని ఒక్కొక్కరి వద్ద రూ.5 వేల నుంచి 10 వేల వరకు వసూల్ చేస్తున్నారు. వారికి మీ సేవ కేంద్రాల నిర్వాహకులతో పాటు రెవెన్యూలో కింది స్థాయి ఉద్యోగులు తోడయ్యారు. ఇదే ప్రక్రియను రేషన్ కార్డులలో కొత్త గా పేర్లు నమోదు, తొలగింపునకు వర్తింపజేసి వసూళ్ళ కార్యక్రమం కొనసాగుతుంది. నిజామాబాద్ జిల్లాలో దాదాపు 90 వేల మందికి పైగా రేషన్ కార్డులలో పేర్లు నమోదు చేయించుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతర ప్రక్రియగా మారింది. దానితో మీసేవ కేంద్రాలు మొదలుకుని తహసీల్ కార్యాలయాల వద్ద దళారుల దందా ఎక్కువైంది. ఒక్క నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనే దక్షిణ, ఉత్తర మండల తహసీల్ కార్యాలయాలతో పాటు నిజామాబాద్ రూరల్ మండలం, మోపాల్ మండలంలో ఇదే పరిస్థితి నెలకొంది. బోధన్ డివిజన్, ఆర్మూర్ డివిజన్ లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
ప్రభుత్వం మీసేవలో దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్దిదారులకు ఎలాంటి రుసుం తీసుకోకుండా రేషన్ కార్డులు మంజూరితో పాటు కొత్తగా పేర్ల నమోదును చేపట్టింది. కానీ ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించడంలో విఫలమయ్యారు. దానిని సొమ్ము చేసుకుంటూ దళారులు బహిరంగంగా వసూళ్ళ కార్యక్రమానికి తెరదీశారు. మీ సేవా కేంద్రాలను మొదలుకుని తహసీల్ కార్యాలయాల వద్ద ఏజంట్లు, దళారులు తామే రేషన్ కార్డులు ఇప్పిస్తామని కొత్త పేర్లు నమోదు చేయిస్తామని వసూళ్ళకు తెగబడ్డారు. ప్రస్తుతం రేషన్ కార్డుల జాతర తహసీల్ కార్యాలయాల వద్ద కొనసాగుతుంది.
- రేషన్ కార్డుల కోసం ఎవరికి డబ్బులు ఇవ్వవద్దు : బాలరాజు(సాత్ తహసీల్దార్), విజయ్ కాంత్ (నార్త్ తహసీల్దార్)
నిజామాబాద్ సౌత్నార్త్ మండలాల పరిదిలోకి వచ్చే ఆయా గ్రామాల ప్రజలకు తెలియ జేయునది ఏమనగాకొత్త రేషన్ కార్డ్ ల కొరకు, ఉన్న రేషన్ కార్డ్ లలో మెంబర్ అడిషన్ కొరకు, రేషన్ కార్డ్ లలో పేర్లు తొలగింపు కొరకు దరఖాస్తులను మీసేవ కేంద్రాల ద్వారా సమర్పించాలి. మీ సేవ కేంద్రాలలో ప్రభుత్వం నిర్ణయించిన రుసుము కంటే అధికముగా చెల్లించరాదు. దళారులు, మద్యవర్తులను నమ్మరాదు. మీ సేవ కేంద్రాలలో దరఖాస్తు చేసిన దరఖాస్తులపై విచారణ అధికారులు తమ ఇంటి వద్దకే వచ్చి విచారణ జరిపి అర్హతను బట్టి కొత్త రేషన్ కార్డుల కొరకు, ఉన్న రేషన్ కార్డ్ లలో మెంబర్ అడిషన్ కొరకు జిల్లా పౌర సరఫరాల అధికారికి సిఫారసు చేయడం , రేషన్ కార్డ్ లలో పేర్లు తొలగింపు ప్రక్రియ జరుగుతుంది. ఎవరైనా డబ్బులు వసూల్ చేస్తే తహసీల్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలి.
