- ఎంఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఇజం వెంకటస్వామి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఈ నెల 4 నుంచి 10 వరకు గ్రామ, మండల, జిల్లా కేంద్రాలలో డప్పులతో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఎంఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఇజం వెంకటస్వామి తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల జిల్లా సమావేశం ఆదివారం ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఇంజం వెంకటస్వామి మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

షమిం అక్తర్ ఇచ్చిన నివేదికలో ఉన్న లోపాలను సవరించి అన్ని కులాలకు రిజర్వేషన్లు అందేలా చూడాలన్నారు. మంత్రి వర్గంలో మాదిగలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణను 3 గ్రూపులుగా కాకుండా ఏబీసీడీ అనే 4 గ్రూపులుగా చెయ్యాలని కోరారు. ఎందరో మాదిగ అమరవీరుల త్యాగాల వల్లె నేటి వర్గీకరణ అనేది సమాజం గమనించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ జస్టిస్ షమిం అక్తర్ గడువును నెల రోజులు పెంచిందన్నారు. మాదిగలు ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలని మంద కృష్ణ మాదిగ ఈ నెల 4 నుంచి 10 వరకు కార్యాచరణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యాచరణను తుచ తప్పకుండా అమలు చెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎంఎస్పీజిల్లా అధ్యక్షులు సరికెల పోశెట్టి మాదిగ, ఎంఎంఎస్ జాతీయ నాయకులు యమున మాదిగ, ఎంఎస్పీ జిల్లా నాయకులు గంధమల నాగభూషణం మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లసింగరీ భూమన్నా మాదిగ, ఎంఆర్పీఎస్ ఉపాధ్యక్షులు రొడ్డ ప్రవీణ్ మాదిగ, ఆకారం రమేష్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి చెవూరి శ్యాం మాదిగ, ఎంఆర్పీఎస్ నిజామాబాద్ టౌన్ అధ్యక్షులు పెదిగారి మహేష్ మాదిగ, ఎంఎంఎస్ జిల్లా కన్వీనర్ పద్మ మాదిగ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

