. . . దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నాగర్ కర్నూలు జిల్లా కుమ్మరి మల్లన్న జాతరలో రజక దంపతులను పై దాడి చేసి వారి రెండు నెలల పసిపాప మృతికి కారణమైన అగ్రవర్ణాల పెత్తందారులు శ్రీనివాస్ రెడ్డి, మధు రెడ్డి, తుకారం రెడ్డి తదితరులను వెంటనే అరెస్టు చేయాలని, కఠినంగా శిక్షించాలని నిజామాబాద్ బీసీ సంక్షేమ సంఘం, రజక ఐక్యవేదిక, వీరనారి చాకలి ఐలమ్మ రజక సంఘం, బీసీ ఎస్సీ, ఎస్టీ జేఏసీ, భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చౌక్ లో మానవాహారం ఏర్పాటు చేసి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని బీసీ కులాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై దాడిని మానవజాతి చరిత్రలోనే అతి హేయమైన సంఘటనగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అభివర్ణించారు. రజక కుటుంబం దాడి చేసి గణేష్ దంపతులను నాలుగు గంటల సేపు ఒక గదిలో నిర్బంధించి తీవ్రంగా హింసించి వారి పాప మరణానికి కారకులైన శ్రీనివాస్ రెడ్డి, మధు రెడ్డి, తుకారం రెడ్డిలను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనకు కారకులైన వారిని ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి నిందితులకు త్వరితగతిన శిక్షపడేలా చూడాలని డిమాండ్ చేశారు.

రజక ఐక్యవేదిక నాయకులు గూపన్పల్లి శంకర్ మాట్లాడుతూ ఇది కేవలం రజకుల పైన దాడి జరిగినట్టు కాదని, యావత్ బడుగు బలహీన వర్గాల పైన అగ్రవర్ణాల వారు చేసిన దాడిగా అభివర్ణించారు. ఇకముందు ఇటువంటి దాడులను సహించేది లేదని, మా కులాల పైన ఎవరైనా దాడి చేస్తే నడిరోడ్డు పైన వారిని గుంజి వారి భరతం పడతామని అన్నారు. రజక సంఘం నగర అధ్యక్షులు సాయిలు మాట్లాడుతూ దాడిలో మృతి చెందిన పసిపాప కుటుంబ సభ్యులకు న్యాయం జరిగే వరకూ పోరాటం ఆపేది లేదని అన్నారు. బీసీ ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి సుమన్ మాట్లాడుతూ అడవిలో మృగాలు కూడా జింక పిల్లను వేటాడకుండా వదిలేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కానీ ఒక పసిబిడ్డను కాలితో నలిపి చంపేయడానికి ఈ అగ్రవర్ణాల జాతులకు మనసు ఎలా వచ్చిందని నిలదీశారు. ఈ కార్యక్రమంలో నరాల సుధాకర్ తో పాటు బుస్స ఆంజనేయులు, గూపన్పల్లి శంకర్, బిక్షపతి, సాయిలు, ప్రభాకర్, సుమన్, పోల్కం గంగ కిషన్, దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, బగ్గలి అజయ్, సాయి బసవ, చంద్రకాంత్, రేఖ, భూమేష్, భూమన్న, వాసం జయ, ప్రేమ్ కుమార్, మహిపాల్, బాలన్న, సురేందర్ గంగాధర్ శ్రీనివాస్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.

