నిజామాబాద్, బతుకమ్మ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. సుభాష్ నగర్ లోని క్యాంప్ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలు అధ్వానస్థితిలో ఉన్నాయని, కొందరు ఉపాధ్యాయులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల నిర్లక్ష్యంగా కారణంగా నాణ్యమైన విద్య అందక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోందన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉపాధ్యాయుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వచ్చే విద్య సంవత్సరానికి ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే విధంగా తల్లితండ్రులకు అవగాహన కల్పించాలని, ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన మన ఊరు మన బడి ధ్వరా వచ్చిన నిధులు వాటి వివరాలు, ప్రస్తుతం ప్రభుత్వం తీసుకొచ్చిన అమ్మఆదర్శ పాఠశాలల పథకం ధ్వరా వచ్చిన నిధులు, పనుల వివరాలు, పాఠశాలలో మౌలిక సౌకర్యాల కల్పనపై చర్చించారు. సమావేశంలో జిల్లా విద్య శాఖ అధికారి అశోక్ కుమార్, నార్త్ , సౌత్ , మండల ఎంఈవోలు, విద్యాశాఖ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
