. . . కాంగ్రెస్ లో పదవులే ముఖ్యం . . . ప్రజా సమస్యలు కాదు
. . . కేంద్రం నుంచి నిధులు నిండుగా వస్తున్నా. . . రాష్ట్రం నుంచి సున్నా
. . . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడిచినా నిజామాబాద్ అర్బన్ అభివృద్ధికి ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేదని, నిధులు కేటాయించి అర్బన్ అభివృద్ధికి సహకరించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ధన్ పాల్ మాట్లాడుతూ జిల్లాపై కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని, ప్రజలను మభ్యపెడుతూ ముందుకు సాగుతుందన్నారు. వైఎస్ఆర్, డీఎస్ మాదిరిగా.. రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ జోడీ లక్కీ అంటున్నారు కానీ..కేవలం జేబులు నింపడానికి జోడీ కలిసిందన్నారు. అర్బన్ విషయంలో అనేక సార్లు మంత్రులను, అధికారులను కలిసి వినతులు అందించినా లాభం లేకుండా పోతుందన్నారు. ప్రభుత్వ పెద్దలు జిల్లాలో అనేక మంది ఉన్నా నిధులు తేవడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ఖమ్మం, కరీంనగర్, వరంగల్ కు వోఆర్ఆర్ మంజూరు చేశారు కానీ నిజామాబాద్ పై చిన్నచూపు ఎందుకని ఎమ్మెల్యే ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు వచ్చి ఓఆర్ఆర్ తీసుకొస్తానంటూ ప్రకటించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ దేనని పిసిసి ప్రెసిడెంట్ జిల్లా వాసి, ఇద్దరు ప్రభుత్వ సలహాదారులు, చైర్మన్లు ఉన్నారని, రూరల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ కు చెందిన వ్యక్తే అయినా నగరానికి రింగురోడ్డు తేలేకపోయారని విమర్శించారు. సీఎం వైయస్సార్ సమయంలోనే జిల్లాకు 52 కిలోమీటర్ల ఓఆర్ఆర్ ప్రణాళిక సిద్ధమైందన్నారు. ఏళ్లు గడుస్తున్న పూర్తి కావడం లేదు అన్నారు. కేవలం 11 కిలోమీటర్ల బైపాస్ రోడ్డును 12 ఏళ్లుగా పూర్తి చేయకుండా నత్తనడకన నడిపిస్తున్నారని విమర్శించారు. అలాగే ఖమ్మం, వరంగల్, కరీంనగర్కు ఆయా అభివృద్ధి పనుల కోసం 5,620 కోట్లు నిధులు వచ్చాయన్నారు. రాష్ట్ర వాటాతో నిధులు సమకూరాయని, కానీ నిజామాబాద్ కు మాత్రం విస్మరించారన్నారు. నిజామాబాద్ అర్బన్ లో 30 ఏళ్లుగా మాస్టర్ ప్లాన్ అటకెక్కిందని, స్టేడియం నిర్మిస్తామని హామీ ఇచ్చి విస్మరించారన్నారు. కళాభారతి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లు అసంపూర్తిగా మిగిలిపోయాయని చెప్పారు. కాంట్రాక్టర్లకు నిధులు చెల్లించకపోవడంతో నిలిచిపోయాయని తెలిపారు. కేంద్రం నుంచి నిధులు నిండుగా వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇలాగే కొనసాగితే బిజెపి పోరాటం ఉదృతం చేస్తుందన్నారు. వచ్చే వారంలో సీఎంని కలుస్తానని, స్పందించకపోతే తమ సత్తా చాటుతామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు నాగోల్ల లక్ష్మీనారాయణ, పోతన్కర్ లక్ష్మీనారాయణ, బీజేపీ ఫ్లోర్ లీడర్ ప్రమోద్, కార్పొరేటర్లు న్యాలం సునీత రాజు, మఠం పవన్, చింతకాయల రాజేందర్, కల్పే చిరంజీవి, జగదీష్ కులకర్ణి, పసునూరి రాము మండల అధ్యక్షులు ఇప్పకాయల కిషోర్, భూపతి తదితరులు పాల్గొన్నారు.

