- డిఈఈకి రాత పూర్వక వినతి
- సీనియారిటీ జాబితా సరి చేయలేదనే ..
- చక్కర్లు కొట్టిన నాయకుని ప్రతులు
- యూనియన్ లలో మొదలైన చర్చ
నిజామాబాద్, బతుకమ్మ: డిచ్ పల్లి డివిజన్ ఏర్పాటేమో గాని యూనియన్ ల మద్య పొర పొచ్చాలు ఏర్పడుతున్నాయి. కొందరు కావాలని, ఇంకొందరు కావాలని అంటూనే వద్దని రాజకీయం చేస్తూ పబ్బం గడుపుతున్నారు. డివిజన్ ఏర్పాటులో జరుగుతున్న జాప్యం గురించి డిసెంబర్ లో ‘బతుకమ్మ’ కథనాలు వెలువరించింది. ఆ సమయంలోనే ఒక యూనియన్ మద్దతు తెలపడం లేదనే ఆగ్రహంతో సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు చెలరేగాయి.
- సోషల్ మీడియాలో …
డిచ్ పల్లి వెళ్ళాలనుకున్న సిబ్బంది సీనియారిటీ జాబితా తప్పుల తడకపై డిఈఈకి ఇచ్చిన దాని గురించి సమాధానం లేకపోవడంతో ఈ నెల 12 నుంచి నిరసన కార్యక్రమాలను చేపడతామని ఇచ్చిన వినతి పత్రం వారి సాంఘిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. అదీనూ స్టేటస్లో పెట్టుకున్న దానిని స్క్రీన్ షాట్ లు తీసి యూనియన్ మాద్యమాల్లో తిప్పుకున్నారు. గతంలో ఉద్యోగ నాయకుల దగ్గర జరిగిన సమావేశంలో కనపడని యూనియన్, హఠాత్తుగా నిరసన తెలుపుతామని ఆర్మూర్ డివిజన్లో ప్రకటించడం ఆ సంఘ నాయకుల నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. డివిజన్ ఏర్పాటును ఎక్కువగా ఆర్మూర్ ప్రాంతం వారే కోరుకుంటున్నారు. ఇక్కడ కామారెడ్డి నుంచి వచ్చినవారు అధికంగా ఉన్నారు. డివిజన్ ఏర్పడితే ఆప్షన్ పెట్టుకొని అక్కడికి వెళ్తే వారి సొంతూళ్ళకు వెళ్లేందుకు ఆస్కారం ఉంటుందని భావించారు. రోజులు, నెలలు గడుస్తున్నా ఇప్పుడు, అప్పుడు అంటూ కాలం వెల్లదీస్తూ వస్తున్నారు. డివిజన్ కోసం ఆప్సన్ పెట్టుకున్న సిబ్బంది సీనియారిటీ జాబితాను సరి చేసి బహిర్గతపరచాలని జనవరి 8న డిఈఈకి వినతి రూపంలో విన్నవించారు. నెల కావస్తున్నా స్పష్టీకరణ రాలేదని గ్రహించి 5వ తేదిన మరోమారు డివిజన్ అధికారిని కలిసి నిరసన చేపడతామని పత్రం అందజేశారు.
- సంఘాల్లో అంతర్మథనం
ఆర్మూర్ డివిజన్ లో డిఈఈకి ఒక యూనియన్ ఇచ్చిన వినతి పత్రం ఇంకొన్ని యూనియన్లలో దుమారం రేపుతోంది. డిచ్ పల్లి డివిజన్ కోసం తాము కట్టుబడి ఉన్నామని చెప్తున్నప్పటికీ, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమయ్యారనే అపవాదును వారి నెత్తిన సంఘ సభ్యులు మోపే పరిస్థితిని తెచ్చుకున్నారు. డిసెంబర్ నెలలో డివిజన్ ప్రస్తావన తుఫానుల మారడంతో, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆప్షన్స్ ఇవ్వాలని ఎస్ఈ ప్రకటన జారీ చేసారు. జాబితా ప్రకటించడంపై జరుగుతున్న ఆలస్యం వెనుక మర్మం ఉందని, దీనిని తేల్చాలని ప్రాతినిద్యం వహిస్తున్న నాయకులపై ఒత్తిడి తెచ్చారు. ఇలాంటి సందర్బాలలో నమ్ముకున్న వారిపట్ల సేవాభావంతో ఉండాల్సిన నాయకులు, సిఎండికి స్పష్టీకరణ కోసం ఎస్ఈ రాస్తామని చెప్పిన విషయాన్ని వారి సంఘ సభ్యులకు పొల్లు పోకుండా వల్లె వేసారు. సంఘ నాయకులు చెప్పింది వాస్తవమే కావచ్చని మిన్నకుండిపోయారు. సంక్రాంతి తర్వాత సిబ్బందికి మెప్పు జరిగేలా యూనియన్లు నిర్ణయాలు తీసుకున్నట్లయితే, వారిని నెత్తిన పెట్టుకొని పూజలు చేసేవారు. ప్రస్తుతం సీన్ రివర్స్ అయినట్లు కనబడుతోంది. డివిజన్ ఏర్పాటుకు మొదటి నుంచి ఆ యూనియన్ దూరంగా ఉందనే విష ప్రచారం ఆర్మూర్ నాయకుని వల్ల పటాపంచలైంది. నిరసన గనుక మొదలైతే డివిజన్ కోసం తాపత్రయ పడుతున్న ఇంకొన్ని సంఘ నాయకులకు చేదు అనుభవం కానుందనే వాఖ్యాలు వినబడుతున్నాయి. ఆర్మూర్ డివిజన్ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతామని ఒక సంఘ నాయకుడు సాహసోపేతమైన నిర్ణయం ప్రకటించడంపై యూనియన్లతో సంబంధం లేకుండా సిబ్బంది ప్రశంసించడం కొస మెరుపు.