- దసరా అమ్మకాల్లో 24 క్యారెట్ గోల్డ్ పేరిట మోసం
- 100 గ్రాముల్లో 2 గ్రాముల దగా
- సొమ్ము చేసుకున్న వ్యాపారులు
- కొనుగోలు చేసి మోసపోయిన ప్రజలు
నిజామాబాద్, బతుకమ్మ : దసరా పండుగ నాడు బంగారం కొనుగోలు సాంప్రదాయం. విజయదశమి నాడు ఏపని ప్రారంభించినా దానికి జాతకాలు, ముహూర్తలు చూడరనే ఆనవాయితీ. ప్రధానంగా బంగారం కొనడం అనేది తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా ఆచారంగా వస్తుంది. దసరా పండుగ నాడు కచ్చితంగా బంగారం కొనుగోళ్లు చేయడం అందులో గ్రాము మొదలుకుని తులాల (10 గ్రాములు) వరకు అయినా కొనడం చేస్తుంటారు. సామాన్యులు మొదులకుని ధనవంతుల వరకు ఈ ఆనవాయితీ ప్రతియేటా జరిగేది. అయితే దసరా సీజన్ లో జరిగిన బంగారం కొనుగోళ్ళలో పౌడర్ బంగారం పేరిట జరిగిన అమ్మకాలు కలకలం రేపుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం అని అంటగట్టిన దాంట్లో వంద గ్రాములు కొనుగోలు చేసిన వ్యక్తికి స్థానికంగా తయారైన బిస్కెట్ ను అమ్మగా అందులో పౌడర్ కలిపి తయారు చేసిందిగా గుర్తించడంతో వ్యవహరం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా బంగారం బ్యాంకుల నుంచి హోల్ సేల్ వ్యాపారులకు వారి నుంచి రిటైల్ వ్యాపారులకు బిస్కెట్ రూపంలో రావడం రివాజు. కానీ నిజామాబాద్ జిల్లాలో ఈ సీజన్ లో జరిగిన బంగారం అమ్మకాల్లో పౌడర్ బంగారం అనే పదం వెలుగులోకి వచ్చింది. హోల్ సేల్ వ్యాపారి వద్ద నుంచి కొనుగోలు చేసిన బంగారం పరీక్షించగా నల్లగా మారడంతో స్థానికంగా రిఫైండ్ అయిందిగా గుర్తించారు. ఇటీవల బంగారం ధర పది గ్రాములకు లక్షా 23 వేలకు చేరిన విషయం తెల్సిందే. ఇదిలా ఉండగా బంగారం కొనుగోళ్ళ వ్యవహరంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కొందరు వ్యాపారులు జీఎస్టీ ఎగవేత(జీరో బంగారం) వ్యవహరం వెలుగులోకి వచ్చింది. ఏకంగా ఐటీ అధికారులు చేసిన దాడితో ఈ వ్యవహరం వెలుగులోకి వచ్చింది. దసరా సీజన్ సమయంలోనే ఆ వ్యవహరంతో జిల్లాలో జీరో బంగారం వ్యాపారం వెలుగులోకి రాగా తాజాగా రిఫైండ్ బంగారం అంశం తెరపైకి వచ్చింది. సాధారణంగా బంగారు నగలు తయారు చేసే వ్యక్తి హోల్ సేల్ వ్యాపారి వద్ద వంద గ్రాముల బంగారు బిస్కెట్ ను కొనుగోలు చేయగా దానిని పరీక్షించగా నల్లగా కావడంతో ఈ విషయాన్ని ఆయన ప్రశ్నించినట్లు తెలిసింది. బంగారంను రిఫైండ్ చేయడం నిషేదం. కానీ కొందరు హోల్ సేల్ వ్యాపారులు స్థానికంగా బంగారం బిస్కెట్లను రిఫైండ్ చేస్తున్నారని, అందులో కక్కుర్తిపడి వంద గ్రాములకు రెండు గ్రాములను పౌడర్ కలుపుతున్నారనే వాదనలకు దసరా నాటి బంగారం సేల్ బహిర్గతం చేశాయి. ఈ విషయంపై సదరు నగల తయారిదారు అసోసియేషన్ ప్రతినిధులను సంప్రదిస్తే ఇప్పటికే సీజన్ లో అమ్మిన బంగారం అంతా అదే రకమని, ఎవరికి రాని బంగారం నీకే ఎందుకు అనుమానం అని నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. మిగిలిన కొనుగోలుదారులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేద్దామని చెప్పినట్లు తెలిసింది. జిల్లా కేంద్రంలో హోల్ సేల్ వ్యాపారం మాటున జరుగుతున్న రిఫైండ్ బంగారం వ్యవహరాన్ని అధికార యంత్రాంగం తేల్చుతుందా లేదా అనేది వేచి చూడాలి. మరికొంత కొనుగోలుదారులు ఫిర్యాదు చేస్తే పోలీసు కేసు అవకాశం ఉంది. కేవలం రెండు గ్రాముల చొప్పున జరిగిన మోసం లక్షల్లో ఉంటుందన్న వాదనలు లేకపోలేదు. చాలా మంది గ్రాము మొదలుకుని పది గ్రాముల వరకు ధనవంతులు, రిటైల్ వ్యాపారులు వంద గ్రాముల వరకు కొనుగోలు చేసిన దాఖలాలున్నాయి. ఈ నేపథ్యంలో పౌడర్ బంగారం(రిఫైండ్) ద్వారా కొనుగోలు చేసిన వారి ద్వారానే ఈ వ్యవహరం బహిర్గతం అయితేనే భవిష్యత్తులో నాణ్యమైన 24 క్యారెట్ల బంగారం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మరికొంత మంది చిరు నగల వ్యాపారులు ఈ అంశాన్ని చర్చించి మూకుమ్ముడిగా ఫిర్యాదు చేసేందుకు సిద్దమౌతున్నట్లు సమాచారం.
