నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
అంతర్జాతీయ లీగల్ మెట్రాలజీ డే సందర్భంగా సివిల్ సప్లై డీఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, ఏఎస్ఓ అరవింద్ రెడ్డి చేతుల మీదుగా లీగల్ మెట్రాలజీ డే పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ వినియోగదారుల రాష్ట్ర కార్యదర్శి సందు ప్రవీణ్ పాల్గొని లీగల్ మెట్రాలజీ శాఖ ప్రాముఖ్యతపై వివరించారు. సందు ప్రవీణ్ మాట్లాడుతూ, బహిరంగ మార్కెట్లో వివిధ వర్గాల వ్యాపారస్తులు ఉపయోగించే తూకాలు, బాట్లు, కొలతలు, వేయింగ్ మిషన్లు, ఎలక్ట్రానిక్ కాంటాలను లీగల్ మెట్రాలజీ అధికారులు ప్రతి సంవత్సరం తనిఖీ చేస్తారని తెలిపారు. సూపర్ మార్కెట్లు, కూరగాయలు మరియు చేపల మార్కెట్లు, రైస్ మిల్లులు, కిరాణా దుకాణాల్లో తూకాలు, కొలతలు అధికంగా వినియోగంలో ఉండటం వల్ల అరుగుదల, గాలి తేమ ప్రభావం, కొందరు వ్యాపారులు కావాలనే బాట్లను అరుగు తీయడం, ఎలక్ట్రానిక్ కాంటాలను ట్యాంపరింగ్ చేయడం వంటి కారణాలతో వినియోగదారులు మోసపోయే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో లీగల్ మెట్రాలజీ ఇన్స్ పెక్టర్ లు ప్రతి సంవత్సరం తనిఖీలు నిర్వహించి తూకాలు, కొలతలను సరిచేసి స్టాంపింగ్ వేస్తారని తెలిపారు. ముఖ్యంగా బంగారు నగల వ్యాపారులు, ఔషధ తయారీ సంస్థల వద్ద ఉపయోగించే సున్నితమైన కాంటాల్లో స్వల్ప తేడా కూడా వినియోగదారులకు ఆర్థిక, ఆరోగ్య పరమైన నష్టాలను కలిగించే ప్రమాదం ఉందని చెప్పారు. అందువల్ల వినియోగదారుల నిత్యజీవితంలో లీగల్ మెట్రాలజీ శాఖ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అయితే ఇటీవల లీగల్ మెట్రాలజీ రూల్స్-2011 సవరణల నేపథ్యంలో, ప్రస్తుతం ప్రతి సంవత్సరం జరిగే తనిఖీలను మూడు లేదా ఐదు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించాలనే ప్రతిపాదనలు వస్తున్నాయని తెలిపారు. ఈ మార్పుల వల్ల నకిలీ తూకాలు, ఎలక్ట్రానిక్ కాంటాల ట్యాంపరింగ్, సున్నితమైన కొలత పరికరాల దుర్వినియోగం పెరిగే అవకాశం ఉందని, దీని ఫలితంగా వినియోగదారులు మరింతగా మోసపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపారాల సరళీకరణ పేరుతో తీసుకొస్తున్న సవరణల కారణంగా వినియోగదారుల హక్కుల పరిరక్షణ నామమాత్రంగా మారే పరిస్థితి ఉందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఉపాధ్యక్షులు వి.ఎన్. వర్మ, జిల్లా కోశాధికారి మహాదేవుని శ్రీనివాస్ తదితరులతో కలిసి వినియోగదారుల మండలి నిజామాబాద్ జిల్లా మరియు రాష్ట్రవ్యాప్తంగా లీగల్ మెట్రాలజీ రూల్స్ సవరణలపై అభిప్రాయ సేకరణ సర్వే, స్టడీ టూర్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా జన విశ్వాస్ చట్టం-2026, లీగల్ మెట్రాలజీ రూల్స్ అమలు ప్రభావంపై దక్షిణాది రాష్ట్రాల్లో వినియోగదారుల సంఘాల అభిప్రాయ సేకరణ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు.