. . . వ్యక్తి బ్రతికుండగానే రికార్డులో చనిపోయినట్లు నమోదు
. . . భిక్కనూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
భిక్కనూరు, బతుకమ్మ :
బ్రతికి ఉన్న వ్యక్తిని రికార్డుల్లో చనిపోయినట్లు నమోదు చేసిన ఘటన భిక్కనూరు మండల కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ లో చోటుచేసుకుంది. బాధితుడు భిక్కనూరుకు చెందిన చిన్న రాజ్యం తెలిపిన వివరాల ప్రకారం తన ఇంటి పై లోను కోసం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేటు ఫైనాన్స్ ను ఆశ్రయించగా అతడికి 10 లక్షల వరకు లోన్ మంజూరు చేశారు. లోన్ షూరిటీ కోసం తన ఎస్ బిఐ బ్యాంకు చెందిన కొన్ని చెక్కులను ఫైనాన్స్ సిబ్బంది కోరగా అతని దగ్గర చెక్ బుక్ అయిపోయింది. దీంతో వెంటనే భిక్కనూరు ఎస్ బిఐ బ్రాంచ్ లో చెక్ బుక్ కోసం దరఖాస్తు చేసుకోగా భిక్కనూరు పోస్ట్ ఆఫీస్ కు చెక్ బుక్ అతడి పేరు పై వచ్చింది. కానీ పోస్ట్ ఆఫీస్ సిబ్బంది అతడికి ఆ చెక్ బుక్ ను ఇవ్వకుండా డెలివరీ రిపోర్టులో ఈ వ్యక్తి చనిపోయాడు అని నమోదు చేశారు. ఈ విషయం తెలియక బాధితుడు పలుమార్లు పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళిన పోస్ట్ ఆఫీస్ సిబ్బంది నీ పేరు మీద ఎలాంటి చెక్ బుక్ రాలేదని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. కానీ గత రెండు రోజుల క్రితం బాధితుడు పోస్ట్ ఆఫీస్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసి తనకు డెలివరీ రిపోర్టును చూపించాలని కోరగా వారు చూసుకోమని రికార్డును అతనికి ఇచ్చారు. ఈ రికార్డులో చెక్ బుక్ వచ్చినట్లు ఉండగా ఈ పేరు గల వ్యక్తి చనిపోయాడని దానిపై రాసి ఉంది. దీంతో ఆశ్చర్యపోయిన బాధితుడు చిన్నరాజ్యం వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భిక్కనూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కాగా చెక్ బుక్ లేకపోవడంతో అతనికి మంజూరైన లోనును ప్రైవేట్ ఫైనాన్సు రద్దు చేసినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.

