27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

రైతుల దుఃఖాన్ని రాజకీయం చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం

Must read

📰 Generate e-Paper Clip

  • ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్

 

హైదరాబాద్, బతుకమ్మ : కష్టాల్లో ఉన్న రైతుల దుఃఖాన్ని రాజకీయ లాభం కోసం వినియోగించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆదివారం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పర్యటించి ప్రభుత్వాన్ని విమర్శించడంపై ఆయన స్పందించారు.  హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఎల్లారెడ్డి నియోజకవర్గం గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు, వరదలతో తీవ్ర నష్టాన్ని చవిచూసింది. రైతుల పంటలు మునిగి నాశనం కాగా, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కష్టకాలంలో ప్రజల బాధలో పాలుపంచుకోవాల్సిన సమయంలో హరీష్ రావు “కాంగ్రెస్ పార్టీని మట్టికలిపిస్తాం” అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వరదల ప్రధాన కారణం — మైనర్ ప్రాజెక్టులు, మైనర్ ఇరిగేషన్ వ్యవస్థల పట్ల గత ప్రభుత్వ నిర్లక్ష్యం. ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు చిన్న ప్రాజెక్టుల అభివృద్ధి పట్ల అసలు దృష్టి పెట్టలేదు. నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్ట్ సిల్ట్ రిమూవల్, స్ట్రెంథెనింగ్ పనులు సమయానికి చేయకపోవడం వల్లే ఈ వరదలు భారీ నష్టం కలిగించాయి. సుమారు 10,000 ఎకరాల పంటలు నష్టపోయాయి. పోచారం ప్రాజెక్ట్ పూర్తిగా కొట్టుకుపోయే పరిస్థితి నుండి మా పోచారం ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాత్రింబవళ్లు కష్టపడి మట్టి సంచులు నింపి, త్రిలింగేశ్వర స్వామి దయతో కాపాడుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీష్ రావు చూపిన శ్రద్ధను ఎల్లారెడ్డి ప్రాంతంలోని మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై చూపలేదు. మాజీ ఎమ్మెల్సీ కవిత కూడా కాళేశ్వరం అవినీతి, హరీష్ రావు పాత్ర గురించి బహిరంగంగా వెల్లడించిన విషయం అందరికీ తెలిసిందే. మీరు నన్ను మీ కార్యక్రమానికి ఆహ్వానించి ఉంటే, నేను వచ్చి ఎల్లారెడ్డి ప్రజలకు మీరు చేసిన ద్రోహాన్ని చూపించి ఉండేవాడిని. మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల అభివృద్ధి లేకపోవడం మీ పాలన వైఫల్యం. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పోచారం ప్రాజెక్ట్‌ ను నేను కాపాడాను. ఇది ఎల్లారెడ్డి ప్రజల జీవనాధార ప్రాజెక్ట్. మీ సొంత ఊరు నల్లమడుగులో ఒక చిన్న మోరీ కూడా సరిగా నిర్మించలేని బిఆర్ఎస్  మాజీ ఎమ్మెల్యే సురేందర్ ఈరోజు “వరల్డ్ బ్యాంకు పోయిండు ” అంటూ చిల్లర కామెంట్లు చేస్తున్నారు.  “గజరాజు పోతుంటే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి” — మేము ఎల్లారెడ్డి అభివృద్ధి దిశగా ముందుకు సాగుతాం, ఇలాంటి మాటలతో మాకు భయం లేదు. ఎల్లారెడ్డి ప్రజల అభివృద్ధి కోసం ఎంత కష్టమైనా, ఎంత దూరమైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాను. మా సీఎం రేవంత్ రెడ్డి అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ, మార్గదర్శనం చేస్తున్నారు. ఆయన నాయకత్వంలోనే ఎల్లారెడ్డి ప్రజల అభివృద్ధి కోసం కృషి కొనసాగుతుంది.  గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసినట్టు పుత్ర రత్నాల” కుటుంబ సభ్యులకు మాత్రమే హక్కులు కల్పించే దొర పరిపాలన ఇక ఉండదు. ప్రజలే అధికారం, ప్రజలకే ప్రాధాన్యం’’ అని అన్నారు.

More articles

Latest article