- విద్యుత్ ఉత్పత్తిలో లక్ష్యం పూర్తి
- 2024-25వ సంవత్సరంలో 62 మిలియన్ యూనిట్ల లక్ష్యం పూర్తి
బతుకమ్మ,మెండోరా:
ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు లక్షల ఎకరాలకు నీరు అందించడమే కాకుండా దిగువ ప్రాంతంలో ఏర్పాటు చేసిన జలవిద్యుత్ ఉత్పత్తిలో తన రికార్డలున తానే తిరగరాసుకుంది. విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండడంతో జెన్ కో కేంద్రం కాంతులతో మెరుపులు మెరుస్తుంది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో మొత్తం 4 టర్బైన్స్ ఉండగా ఒక్కొక్క టర్బెన్ ద్వారా 9 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. దీంతో నాలుగు టార్బైన్ల ద్వారా 36.45 మెగావట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. 2024-25 ఈ ఆర్థిక సంవత్సరం 62 ఏం యు(మిలియన్ యూనిట్స్) లక్ష్యం కాగా శనివారం 62 ఎం యు విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం పూర్తి చేసింది.
- గతంలో రికార్డు స్థాయిలో ఉత్పత్తి..
శ్రీరాం సాగర్ నిర్మాణం తరువాత విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉండటంలో జెన్ కో విద్యుత్ కేంద్రాన్ని ఏర్పటు చేశారు. మొదటిసారి రికార్డ్ స్థాయిలో 1991 సంవత్సరంలో 146.43 విద్యుత్ ఉత్పత్తి జరిగింది. రెండవసారి రికార్డు స్థాయిలో 2022 – 23వ సంవత్సరంలో 138.92 ఎంయూ విద్యుత్ ఉత్పత్తి జరిగింది. 2019 అక్టోబర్ 22 ఒక్కరోజు రికార్డు స్థాయిలో 0.8923 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగింది.
విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన నీటి విడుదల కారణంగా నీటి సామార్థ్యం నానాటికి తగ్గుతోంది. గత ఏడాది జూన్ 1 నుంచి ప్రాజెక్టుకు 288.517టీఎంసీల ఇన్ ఫ్లో వచ్చింది. ఆనాటి నుంచి శనివారం వరకు ప్రాజెక్టు నుంచి 267.371టీఎంసీల నీటికి దిగువకు వదిలారు. ప్రస్తుతం లక్ష్మీ కెనాల్, కాకాతీయ ప్రధాన కాలువ, అలీసాగర్, గుత్ప ఎత్తిపోతలు, నిర్మల్, సరస్వతి కాలువల ద్వారా మిషన్ భగీరథ ద్వారా ప్రతి రోజూ నీటి విడుదల కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 25.167టీఎంసీల నీరు మాత్రమే నిలువ ఉంది. గతేడాది ఇదే రోజు ప్రాజెక్టులో 17.243 టీఎంసీల నీరు మాత్రమే ఉండే. ఈసారి ఎండలు ముందే ముదురుతుండటంతో ప్రాజెక్టులో నీటి విడుదల జరిగే అవకాశం ఉంది.
- సమిష్టి కృషితో లక్ష్యం చేరుకున్నాం.
- శ్రీనివాస్ (డిఈఈ జెన్ కో) పోచంపాడ్.
2024-25 ఈ సంవత్సరం 62 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే లక్ష్యం ఉంది. వర్షాలు అధికంగా కురవడం జెన్ కో సిబ్బంది అందరం సమిష్టి కృషితో లక్ష్యం చేరుకునే విధంగా కృషి చేశాము. ఫలితంగా శనివారం 62.1513 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం చేరుకొని జెన్ కో కేంద్రంలో సిబ్బంది అందరు అభినందనలు తెలుపుకున్నారు.