బీజే ప్రభుత్వ కళాశాల హాస్టల్ భవనంపై కూలిన విమానం
టేకాఫ్ అయిన కొద్దిసేపటికే..
కూలిన విమానంలో విజయ్ రూపానీ లేరు : వ్యక్తిగత సహాయకుడు
ప్రాథమిక సమాచారం ప్రకారం 110 మందికి పైగా ప్రయాణికులు మృతి
మొత్తం 242 మంది ప్రయాణికులు
అహ్మదాబాద్ కు బయలుదేరిన అమిత్ షా
అహ్మదాబాద్, బతుకమ్మ : గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి లండన్ బయలుదేరిన ఫ్లయిట్ నంబర్ ఏఐ-171 విమానం కూలిపోయింది. ఈప్రమాదంలో 110 మందికి పైగా ప్రయాణికులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో దానిలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ దేశస్థులు, ఏడుగురు పోర్చుగీస్ దేశస్థులు, ఒకరు కెనడియన్ ఉన్నారు. రన్ వే నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ప్రమాదం గురైంది. రన్ వే 23 నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు విమానం టేకాఫ్ కాగా.. కొన్ని క్షణాల్లోనే కూలిపోయింది. ఆ సమయంలో పైలట్ల నుంచి ఏటీసీ కి మేడే కాల్ వచ్చినట్లు పౌర విమానయన శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈవిమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూలిన విమానంలో లేరని ఆయన వ్యక్తిగత సహాయకుడు స్పష్టం చేశారు. వేరే విమానం ఎక్కినప్పటికీ విజయ్ పేరు మాత్రం కూలిన విమానంలోని ప్రయాణీకుల జాబితాలో ఉందని వెల్లడించారు. బీజే ప్రభుత్వ కళాశాల హాస్టల్ భవనంపై విమానం కూలింది. భోజన సమయం కావడంతో హాస్టల్ లోనే అధిక శాతం పీజీ వైద్య విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. 20 మందికి పైగా మెడికోలు మృతి చెందారు. ఇందుకు సంబంధించిన వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విమానం కూలిన చోట రెండు భారీ భవనాలను మంటలు అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగ్వేషన్ బ్యూరో (ఏఏఐబీ) డీజీ ఇతర అధికారులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపడుతున్నారు. విమాన ప్రమాదం తెలుసుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హుటాహుటినా విజయవాడ నుంచి అహ్మదాబాద్ కు బయలుదేరారు ఈనేపథ్యంలో సాయంత్రం 5 గంటల వరకు అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ ను మూసివేయనున్నారు. ప్రధాని మోదీ ప్రమాద ఘటనపై ఆరా తీశారు. వెంటనే అమిత్ షాను అహ్మదాబాద్ వెళ్లి పరిస్థతి సమీక్షించాలని సూచించారు. ప్రమాదంపై దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. ప్రయాణికుల సమాచారం కోసం 1800 5961 444 నంబర్ ను తీసుకొచ్చినట్లు వెల్లడించింది. 011-24610843, 9650391859 నంబర్లను సంప్రదించాలని పౌరవిమానయాన శాఖ కంట్రోల్ ఏర్పాటు చేసింది. కాగా, ఈఘటనపై తెలంగాణ, ఏపీ సీఎంలతో పాటు పలువురు ప్రముఖులు ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని కోరారు.