. . . సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర సెక్రటెరియట్ సభ్యులు కె.రమ
. . . కామ్రేడ్ డీవీ కృష్ణ 4వ వర్ధంతి సందర్భంగా స్మారక కార్యక్రమం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
ఫాసిస్టు విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా బలమైన ప్రజా ఉద్యమాలను నిర్మించాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కే. రమ, కేజీ రామచందర్ పిలుపునిచ్చారు. ఆదర్శ కమ్యూనిస్టు కార్మిక వర్గ పోరాట యోధుడు కామ్రేడ్ డీవీ కృష్ణ 4వ వర్ధంతి సందర్భంగా పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం స్మారక కార్యక్రమం నిర్వహించారు. రేడియో స్టేషన్ ఎదురుగా ఉన్న డీవీకే నగర్‌లోని కామ్రేడ్ డీవీ కృష్ణ స్మారక స్థూపం వద్ద పార్టీ జెండాను రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యురాలు కే. రమ ఆవిష్కరించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత న్యూ అంబేద్కర్ భవన్‌లో పార్టీ అర్బన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ అధ్యక్షతన స్మారకోపన్యాసాల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా “ఆర్థిక సంక్షోభం – ప్రజలకు సవాళ్లు”, “దేశంలో పెరుగుతున్న ఫాసిజం”, “డీవీకే సిద్ధాంత రాజకీయ కృషి” వంటి అంశాలపై వక్తలు ప్రసంగించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కేజీ రామచందర్, కే. రమ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభ పరిస్థితులు నెలకొంటున్నాయని అన్నారు. సామ్రాజ్యవాద శక్తులు యుద్ధాలను ప్రజలపై రుద్ది, భారాలను మోపుతున్నాయని విమర్శించారు. బడా కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం ప్రజల సంక్షేమాన్ని పక్కన పెడుతున్న పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. దేశంలో మోడీ ప్రభుత్వ 12 ఏళ్ల పాలనలో రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయని వారు విమర్శించారు. మత ప్రాతిపదికన విభజన రాజకీయాలు పెరుగుతున్నాయని, ముస్లింలు, ఇతర మతాల ప్రజలతో పాటు కమ్యూనిస్టులు, విప్లవకారులు, ప్రతిపక్షాలపై అణచివేత ధోరణి కొనసాగుతోందని ఆరోపించారు. ప్రజల హక్కులను హరిస్తూ కార్మికులు, రైతులు, యువత, మహిళలు, దళితులు సహా అన్ని వర్గాల ప్రజల జీవితాలను ప్రభుత్వం దుర్భరం చేసిందని అన్నారు. ఈ పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్, బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు సంఘటితంగా ఉద్యమాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. బలమైన ప్రజా ఉద్యమాల నిర్మాణమే ప్రజావ్యతిరేక విధానాలకు సమాధానమని, ప్రజల్లో చైతన్యం పెంపొందించడమే కామ్రేడ్ డీవీ కృష్ణకు నిజమైన నివాళి అని నేతలు పేర్కొన్నారు. కార్యక్రమంలో అరుణోదయ కళాకారులు విప్లవ గీతాలతో ప్రజలను చైతన్యపరిచారు. పార్టీ సెక్రటేరియట్ సభ్యులు బి. ప్రభాకర్, రాష్ట్ర నాయకులు ఎం. నరేందర్, పి. రామకృష్ణ, కామ్రేడ్ డీవీ కృష్ణ సోదరులు చంద్రశేఖర్ రెడ్డి తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు వెంకన్న, రాజేశ్వర్, దేవరాం, గంగాధర్, ముత్తన్న, రవీందర్, సుధాకర్, మల్లేష్, కిషన్, రమేష్, మురళి తదితరులతో పాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
