- గ్రామాలలో దొంగల భయం.. గ్రామస్తుల జాగారం
- అప్రమత్తమైన గ్రామస్ధులు..
- గ్రామ రక్షణ దళాల ఏర్పాటు
- కర్రలు చేతపట్టి.. ఊరంతా గస్తీ
- కొత్త వ్యక్తులు వస్తే సమాచారం పోలీసులకు చేరవేత
నిజామాబాద్ క్రైం, బతకమ్మ : దొంగల భయంతో ఆ గ్రామస్ధులు వణికిపోయారు.. కంటి మీద కునుకు లేకుండా బిక్కబిక్కుమంటు గడిపారు. మహిళలు, చిన్నారుల్లో దొంగల భయం పెరిగిపోవడంతో.. వారిలో ధైర్యం నింపేందుకు.. గ్రామస్ధులంతా ఒక్కటయ్యారు. దొంగల భరతం పట్టి దొంగతనాలను అరికట్టేందుకు.. గ్రామ రక్షణ కోసం గస్తీ బృందాలుగా ఏర్పడ్డారు. తమ గ్రామానికి తామే రక్షకులమంటూ.. గ్రామ యువకులు, పెద్దలు బృందాలుగా ఏర్పడి ఇంటికొకరు పోలీసుగా మారారు.
రాత్రంతా గ్రామాన్ని కంటికి రెప్పలా కాపలా కాస్తున్నారు… కొత్త వ్యక్తులు గ్రామంలో అడుగుపెడితే.. పట్టుకుని పోలీసులకు అప్పగిస్తున్నారు.. ఇంటికొకరు పోలీసుగా ఎలా మారారు.. దొంగతనాలను అరికట్టేందుకు గ్రామస్ధులు ఏం చేస్తున్నారు.. కర్రలు చేత పట్టుకుని.. గ్రామ పొలిమేరల్లో కాపలా కాస్తున్న వీళ్లంతా.. నిజామాబాద్ జిల్లా కులాస్ పూర్ గ్రామస్ధులు. ఇటీవల కులాస్ పూర్ గ్రామంలో ఒకే రోజు 11 ఇళ్లలో చోరీ జరగడంతో గ్రామస్తులంతా హడలెత్తిపోయారు. మహిళలు భయాందోళనకు గురయ్యారు. దీంతో గ్రామస్ధులు పోలీసుల సహకారంతో గస్తీ బృందాలుగా ఏర్పడ్డారు. దొంగతనాలను అరికట్టేందుకు స్వయంగా రంగంలోకి దిగారు గ్రామస్ధులు. కర్రలు చేత పట్టుకుని ఇంటికొకరు పోలీసుగా మారారు. గ్రామాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ… పొలిమేరల్లో జాగారం చేస్తున్నారు. దొంగతనాలకు చెక్ పెట్టేందుకు గ్రామంలోని 21 కుల సంఘాలతో ఓ కమిటీ వేశారు. కులానికి ఒక్కరు చొప్పున రోజు గ్రామాన్ని కాపలా కాస్తున్నారు. అర్దరాత్రి వరకు వారితో కలియ తిరిగి దొంగతనాలను అరికట్టేందుకు యూనిఫాం లేని పోలీసులుగా వ్యవహారిస్తున్న తీరును పరిశీలించింది. గ్రామస్తులు ఎందుకు ఇలా గస్తీ చేస్తున్నారో తెలుసుకుందాం.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస చోరీలతో పోలీసులకు సవాలు విసురుతున్నారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ… దొరికిన వస్తువులు దొరికినట్లు ఎత్తుకెళ్తున్నారు. నిజామాబాద్, బోధన్, బాన్సువాడ, ఆర్మూర్ లో ఇళ్లు, వ్యాపార సముదాయాల్లో చొరబడి అందిన కాడికి దోచేస్తున్నారు. ముసుగు వేసుకుని దొంగలు సంచరిస్తుండటం సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో గ్రామస్ధులు హడలెత్తిపోతున్నారు. కొన్ని చోట్ల మరణాయుధాలతో సంచరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
దొంగల ముఠాకు ఎదురు నిలబడేందుకు.. కులాస్ పూర్ గ్రామస్ధులు సిద్దం కావడంతో.. వారి బాటలో మరికొన్ని గ్రామాలు సైతం గ్రామ రక్షణ బృందాలు ఏర్పాటు చేసుకునేందుకు సిద్దం అవుతున్నాయి. మహిళలు సైతం ఆరు బయట అర్దరాత్రి వరకు గుంపులుగా కుర్చుంటున్నారు. ఇంటి పెద్దలు రాత్రి గస్తీ కాస్తుంటే.. మహిళలు ఆరు బయట బీడీలు చుడుతూ వారికి అండగా అర్దరాత్రి వరకు ఇంటికి రక్షణగా ఉంటున్నారు. కులాస్ పూర్ లో యూనిఫాం లేని పోలీసులుగా మారిన గ్రామస్ధులకు మహిళలు ఇలా ఉండగా ఉంటున్నారు.
గ్రామాలలో రాత్రి 10 గంటలు అయ్యిందంటే గస్తీ బృందాలు పంచాయతీ కార్యాలయానికి చేరుకుంటారు. ఒక్కో కులం నుంచి వచ్చిన యువకులు పెద్దల అటెండెన్స్ తీసుకుంటారు. 21 మందితో బృందాలను ఏర్పాటు చేసి మూడు బృందాలుగా గ్రామానికి మూడు పొలిమేరలకు పంపుతారు. ఒక్కో బృందంలో యువకులు, మధ్య వయస్సు వారు ఉండేలా చూస్తారు. కర్రలు చేతిలో పట్టుకుని టార్చి లైట్ తో ఊరంతా కలియతిరుగుతారు. రాత్రి 10 నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు పహారా కాస్తుంటారు గ్రామస్ధులు. గ్రామంలో రాత్రి 10 తరవాత ఎవరైనా కొత్త వారు వస్తే ప్రశ్నించి వివరాలు సేకరిస్తున్నారు. అనుమానస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు అప్పగిస్తారు. కొత్త వ్యక్తులు గ్రామానికి వస్తే గస్తీ బృందాలు ఏం చేస్తాయి… కులాస్ పూర్ స్పూర్తితో.. చుట్టు పక్కల 10గ్రామాల ప్రజలు గస్తీ బృందాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇటు పోలీసులు సైతం పెట్రోలింగ్ పెంచడంతో పాటు గస్తీ బృందాల ఏర్పాటు కోసం చైతన్యం కల్పిస్తున్నారు. గస్తీ దళాలు ఏ మేరకు సత్పలితాలు ఇస్తాయో వేచి చూడాలి.
