- ఎమ్మెల్యే పోచారానికి చుక్కెదురు
- జుక్కల్ నియోజకవర్గంలో అధికారులను నిలదీసిన కాంగ్రెస్ నేతలు
- రామారెడ్డిలో అధికారులను నిలదీసిన గ్రామ ప్రజలు
- వేల్పూర్ లో కాంగ్రెస్ కార్యకర్తలకే పతకాలు అని నిలదీసిన ప్రజలు
నిజామాబాద్, బతుకమ్మ :
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంలో ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీల అమలుకై గ్రామసభల్లో అర్హుల జాబితాను ప్రకటించేందుకు నిర్వహిస్తున్న సభలో నిరసనలకు వేదికలుగా మారాయి. ప్రధానంగా ఏడాది కాలంలో మహిళలకు ఉచిత బస్సు, రుణమాఫీ, రూ.500 గ్యాస్ బండ, 200 యూనిట్ల ఉచిత కరెంట్ పథకాలు మినహా ప్రధాన పథకాలను గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం యోచిస్తున్న విషయం తెలిసిందే. ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డులు, రైతుభరోసా కోసం అర్హుల జాబితాలను ప్రకటించేందుకు ప్రారంభమైన గ్రామసభలు, వార్డు సభల్లోనూ నిరసన వ్యక్తం అవుతుంది. ప్రధానంగా అందరూ ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే దరఖాస్తులకు ఎంపికైన లబ్దిదారులకు పొంతన లేకపోవడంతో వారు నిరసన చేస్తున్నారు. ప్రధానంగా రేషన్ కార్డులు, అర్హుల కోసం నిర్వహించిన సర్వేతో పాటు జాబితాపై మండిపడుతున్నారు. సభలు ప్రారంభమైన నాటి నుంచి ఇదే తంతు కొనసాగుతుంది.
బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డిని ప్రజలు నిలదీశారు. బాన్సువాడ పట్టణంలో జరుగుతున్న గ్రామసభలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవని ప్రశ్నించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పోచారం శ్రీనివాస్ రెడ్డిని నిలదీయడంతో ఆయన అసహనానికి గురయ్యారు. సమస్యలు ఉంటే తనకు చెప్పాలని సభను సజావుగా సాగించాలని అన్నారు. అయితే వారు ప్రభుత్వ హామీల అమలు, డిమాండ్ ను వెతుక్కోవడంతో పోలీసులను పిలిచి సభను ఆటంకం కలిపిస్తున్న వారిని అక్కడి నుంచి పంపించేయాలని ఆదేశించారు.
రామారెడ్డి మండలం రెడ్డిపేటలో నిర్వహించిన గ్రామసభలో ప్రజలు అధికారులను నిలదీశారు. రెండు లక్షల రుణమాఫీ అని ప్రకటించిన ఇప్పటి వరకు కొందరు రైతులకు రూ.30 వేల రుణమాఫీ కూడా ఎందుకు కాలేదని రైతులు ప్రశ్నించారు. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తామని, ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకుని జాబితాలో ఎందుకు పేర్లు పెట్టలేదని నిలదీశారు. రైతుల నుంచి ప్రజల నుంచి మళ్ళీ దరఖాస్తులు స్వీకరిస్తామని అధికారులు తెలిపినా వారు నిరాకరించారు.
వేల్పూర్ మండలం జానకంపేట్ గ్రామసభలో అర్హులైన వారికి కాకుండా ప్రభుత్వ పథకాలు అనర్హులకు అందుతున్నాయని గ్రామస్తులు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే అర్హుల జాబితాలో పేర్కొన్నారని నిలదీశారు. గ్రామంలో పేద వారు దరఖాస్తు చేసుకున్న వారు పేర్లు ఎందుకు లేవని నిలదీశారు.
రుద్రూర్ మండలంలో ప్రజాపాలనలో ఎమ్మార్వో , ఎంపీడీవోలను బీజేపీ నాయకులు నిలదీశారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుంటే అన్ని కలిగిన వారికే జాబితాలో పేర్లు వచ్చాయన్నారు. కాంగ్రెస్ పాలనలో అర్హులకు కాకుండా అనర్హులకు పథకాలను మోసం చేస్తున్నారని నిలదీశారు.
