. . . బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పానుగంటి సతీష్ రెడ్డి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
జిల్లాలోని ఇందల్వాయి మండలం, మాక్లూర్ తండాలో ఉన్న ఏకలవ్య పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి ఉరి వేసుకుని మృతి చెందడం పై బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పానుగంటి సతీష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి ఉరివేసుకొని మృతి చెందడం అత్యంత విషాదకరమని, ఈ ఘటన జిల్లా ప్రజలను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఈ దుర్ఘటనకు పాఠశాల ప్రిన్సిపాల్, కొంతమంది ఉపాధ్యాయుల మానసిక ఒత్తిడి కారణమని తోటి విద్యార్థులు వెల్లడించడం చాలా ఆందోళన కలిగించే అంశమన్నారు. విద్యార్థులకు మార్గదర్శకులుగా ఉండాల్సిన వారు ఒత్తిడి తీసుకురావడం వల్ల ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోవడం విద్యా వ్యవస్థపై పెద్ద ప్రశ్నార్థక చిహ్నం వేస్తోందన్నారు. ఇప్పటి వరకు సంబంధిత అధికారులు పూర్తి స్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోలేదన్నారు. వెంటనే నిష్పక్షపాత విచారణ జరిపి, తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించి, కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సతీష్ రెడ్డి హెచ్చరించారు. ఈ సందర్బంగా జిల్లా బీజేవైఎం ప్రధాన కార్యదర్శి అమంద్ విజయ్ కృష్ణ మాట్లాడుతూ విద్యార్థి మృతి చాలా బాధాకరమన్నారు. జిల్లాలో విద్యార్థులకు రక్షణ లేకుండా పోతుందని, ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. అతని మృతికి కారణమైన ఉపాధ్యాయుల పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళనలు, నిరసనలు చేపడతామని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, న్యాయం జరిగే వరకు వారి పక్షాన నిలబడతామని స్పష్టం చేశారు.
