బతుకమ్మ దుబ్బాక ప్రతినిధి : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని దుబ్బాక ఎస్ఐ గంగరాజు, సిబ్బందితో కలసి ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించి విద్యార్థిని విద్యార్థులకు మంగళవారం అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా పోలీసులు నిర్వహిస్తున్న విధుల గురించి, పోలీస్ స్టేషన్ ఫంక్షన్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ రూమ్, రైటర్ రూమ్, లాకప్, రిసెప్షన్, పోలీసులు ఉపయోగిస్తున్న ఆయుధాల గురించి, నూతన చట్టాల గురించి, టెక్నాలజీ గురించి, విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎస్ఐ గంగరాజు మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల త్యాగాల ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలని, రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని సైబర్ నేరాల వలలో పడకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసులు ప్రజల ధన, మాన ప్రాణ రక్షణ గురించి ఎల్లవేళలా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రజలకు ఏదైనా రక్షణ అవసరం ఉంటే పోలీసుల సహాయం కావాలనుకుంటే వెంటనే డయల్ 100 కు కాల్ చేయాలని సూచించారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

