బతుకమ్మ : నాగిరెడ్డిపేట్ : మండలంలోని చీనూరు గ్రామానికి చెందిన ఎనుగండ్ల మొగులయ్య (47) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు మంజీరా నదిలో మునిగి మృతి చెందినట్లు స్థానిక ఎస్ఐ మల్లారెడ్డి కలిపారు. ఎస్సై కలిపిన వివరాల ప్రకారం ఎనుగండ్ల మొగులయ్య కుమారుడు రాజు తమ ఆరు గేదెలను శుక్రవారం ఉదయం గ్రామ సమీపంలోని మంజీర నది సమీపంలోకి మేతకు తీసుకెళ్లగా గేదెలు మేత మేస్తూ మంజీరా నది అవతలి ఒడ్డు పాపన్నపేట మండలం కుర్తివాడ గ్రామ శివారు లోకి వెళ్లాయి. దీంతో రాజు తన తండ్రి మొగులయ్యకు చెప్పడంతో తండ్రి మొగులయ్య, తల్లి లక్ష్మీ లు కలిసి మంజీరా నది వద్దకు వెళ్ళారు. మంజీరా వాగు అవతలి వైపుకు వెళ్లిన గేదెలను ఇంటికి తీసుకురావడానికి మొగులయ్య నదిలో ఈదుతూ అవతలి వైపుకు వెళుతుండగా మంజీరా నది లోతు ఎక్కువగా ఉండడంతో భార్య కుమారులు చూస్తుండగానే ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యాడు. శుక్రవారం ఉదయం గ్రామస్తుల సహాయంతో మంజీరా నదిలో వెతకగా మొగులయ్య మృతదేహం లభ్యమైందన్నారు. మృతుని భార్య లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై మల్లారెడ్డి తెలిపారు.
