నిట్టూను నిరాకరించిన కాంగ్రెస్
. . . కొండల్ రెడ్డిని అడ్డుకోవడమే కొంప ముంచిందా?
. . . పార్లమెంట్ ఎన్నికల సమయంలో వాడుకొని వదిలేసిన బీజేపీ
. . . బహిష్కరణ చేసిన బీఆర్ఎస్ పార్టీ
. . . అగమ్యగోచరంగా నిట్టూ రాజకీయ భవిష్యత్
బతుకమ్మ, కామారెడ్డి :
బీఆర్ఎస్ బహిష్కృత నేత నిట్టూ వేణు గోపాల్ రావ్ అధికార కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నిట్టూ వేణుగోపాల్ రావ్ తో పాటు మరో నలుగురిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీలో చేరేదుకు నిట్టూ వేణుగోపాల్ రాకను కాంగ్రెస్ అధిష్టానం నిరాకరించడంతో కుడితిలో పడ్డ ఎలుక అన్న చందంగా మారింది ఆయన పరిస్థితి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి అసెంబ్లీ నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పోటీ చేయగా, ఇంచార్జిగా కొండల్ రెడ్డి వ్యవహరించారు. ఈ సమయంలో నిట్టూ వేణు గోపాల్ రావ్ తన అనుచరులతో కలిసి అప్పటి కాంగ్రెస్ ఇంచార్జిగా ఉన్న రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డిని అడ్డుకొని దాడికి యత్నించారు. కామారెడ్డి మున్సిపాలిటీ వద్ద, నిజాం సాగర్ చౌరస్తా వద్ద అడ్డుకుని కొండల్ రెడ్డిపై దాడికి యత్నించిన ఘటనపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా తీసుకోంది. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని నిట్టూ వేణు గోపాల్ చేసిన ప్రయత్నంకు అధిష్టానం అడ్డుకట్ట వేసింది. దీంతో నిట్టూ కాంగ్రెస్ కు రావాలని ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. మరోవైపు మంత్రి పదవి రేసులో ఉన్న షబ్బీర్ అలీ సైతం నిట్టూ రాకను వ్యతిరేకించినట్లు తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం గతంలో కొండల్ రెడ్డి పై దాడికి యత్నించిన ఘటనే కారణంగా ప్రచారం జరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో జాహిరబాద్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ కు మద్దతిచ్చిన నిట్టూ వర్గంకు బీజేపీ పార్టీ సైతం షాక్ ఇచ్చింది. బీజేపీ పార్టీలో తనతో పాటు కొందరు కౌన్సిలర్లు చేరేందుకు చేసిన ప్రయత్నాలను కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి సైతం అడ్డుకున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ బహిష్కరణ చేయగా, అటు కాంగ్రెస్ పార్టీ నిట్టూను రాకుండా అడ్డుకున్న పరిస్థితి ఏర్పడింది. దీంతో నిట్టూ వేణుగోపాల్ రావ్ రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. మరి ఏ పార్టీలోకి వెళ్తారనేది కామారెడ్డిలో చర్చ జరుగుతుంది.