- గేటు వద్దే అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది
- లోనికి ప్రవేశించేందుకు యత్నం
- డిచ్ పల్లి సీఎంసీ వద్ద ఉద్రిక్తత

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని నడిపల్లి వద్ద గల క్రిస్టియన్ మెడికల్ కళాశాల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సీఎంసీ కళాశాలలోకి వెళ్లేందుకు ఐఎంఎస్ఆర్ (ఇంటిగ్రేటెడ్ మెడికల్ సైన్స్ రీసెర్చ్ సెంటర్) చైర్మన్ షణ్మగ మహాలింగం ప్రయత్నించడంతో సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (సీఎస్ఐ) ఆధీనంలోని వైద్య విద్య సంస్థ సీఎంసీతో గతేడాది ఐఎంఎస్ఆర్ సంస్థ ఒప్పందానికి వచ్చినట్లు తెలిసింది. అయితే అక్కడ పాలకమండలి నియామకంలో, పాలకవర్గ సభ్యుల నియామకాల్లో విభేదాలు బట్టబయలయ్యాయి. ఇటీవల కాలంలో సీఎంసీ నిర్వాహణ కోసం మెడికల్ కళాశాలలో చేపట్టిన డాక్టర్ల నియామకం, బోధనేతర సిబ్బంది, ఇతర సిబ్బంది నియామకంలో విభేదాలు బహిర్గతమయ్యాయి. అదే సమయంలో సీఎంసీ మెడికల్ కళాశాలకు ఎంసీఐ అనుమతి నిరాకరణ, సామాగ్రి కొనుగోళ్ళ వ్యవహరంలో చైర్మన్ కు, డైరెక్టర్ల మధ్య విభేదాలతో రచ్చకెక్కిన విషయం తెల్సిందే. ఈ విషయంలో ఇరువురు పోలీసులకు పరస్పర ఫిర్యాదులు చేసుకోగా కేసులు నమోదయ్యాయి.

నిజామాబాద్ జిల్లాలోని జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న సీఎంసీ నిర్వాహణపై సీఎస్ఐకి, ఐఎంఎస్ఆర్ సంస్థకు మధ్య విభేదాల నేపథ్యంలో అక్కడ నిర్వాహణపై ఎవరికి వారు ఆధీపత్యం ప్రదర్శించే ప్రయత్నం జరుగుతుంది. ఇటీవల పక్షం రోజుల వ్యవధిలో మెడికల్ కళాశా నిర్వాహణ అంతా తనదేనని ఐఎంఎస్ఆర్ చైర్మన్ షణ్ముగ మహాలింగం మీడియా ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. అయితే నిజామాబాద్ కు చెందిన ప్రముఖ వైద్యులు అజ్జ శ్రీనివాస్ తనను సీఎస్ఐ పాలకమండలి డైరెక్టర్ గా నియమించిందని చెప్పుకొచ్చారు. ఇటీవల కాలంలో సీఎంసీలోకి ప్రవేశించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఉద్రిక్త పరిస్థితులకు కారణమయ్యాయి. శనివారం సీఎంసీలోకి షణ్ముగ మహాలింగం ప్రవేశించేందుకు ప్రయత్నించగా ప్రధాన గేటు వద్ద సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. అక్కడ సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వివాదం జరిగింది. చివరకు స్థానిక డిచ్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అక్కడకు చేరుకుని వివాదాన్ని సద్దుమనిగించే ప్రయత్నం చేశారు.
సీఎంసీపై పెత్తనం సీఎస్ఐదా? లేక ఐఎంఎస్ఆర్ సంస్థదా అనే చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే శతాబ్ధాల చరిత్ర కలిగిన సీఎస్ఐ డిచ్ పల్లిలో రెండు దశాబ్ధాలు మెడికల్ కళాశాలను నిర్వహించిన విషయం తెల్సిందే. ఉమ్మడి రాష్ట్రంలో మూతబడిన సీఎంసీ కళాశాలను తెరిచి రన్ చేసేందుకు గతేడాది కాలంగా సీఎస్ఐ నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తుండగా అందులో భాగంగా ఓ ప్రైవేట్ సంస్థతో లీజు ఒప్పందంతో పాటు నిర్వాహణ ఒప్పందం జరిగిన అది కార్యరూపం దాల్చకముందే గొడవలు షురూ అయ్యాయి. పోలీసు కేసులు, కోర్టు నోటీసుల నేపథ్యంలో దాని నిర్వాహణ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. సీఎస్ఐ నిర్వాహకులు ప్రైవేట్ సంస్థపై చేస్తున్న ఒప్పందంపై పునరాలోచనలో పడగా కొత్తగా ఐఎంఎస్ఆర్ సంస్థ మాత్రం కొత్త డైరెక్టర్లను, పాలకమండలిని నియమిస్తున్నామని కళాశాలను నిర్వహించి తీరుతామని చెబుతున్నారు. అయితే సీఎస్ఐ డైరెక్టర్ల నియామకంతో పాటు ఏకంగా ఐఎంఎస్ఆర్ సంస్థ చైర్మన్ ను సీఎంసీలోకి రాకుండా అడ్డుకోవడంతో వివాదం ముదిరి పాకాన పడింది.

