- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
కామారెడ్డి, బతుకమ్మ : నిజాంసాగర్ ప్రాజెక్ట్ మన వారసత్వ సంపద అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా గురువారం కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టును తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్మించిన నిజాం ప్రభుత్వ చీఫ్ ఇంజనీర్ నవాజ్ అలీ జంగ్ బహదూర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘‘1923 లో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ వందేళ్లు పూర్తి చేసుకుంది. జుక్కల్ లో ప్రాజెక్ట్ ఉన్నప్పటికీ బాన్సువాడలో 60 వేల ఎకరాలు నీళ్లు ఇచ్చుకోగలుగుతున్నాం. మూడు కిలోమీటర్ల వరకు మూడు గేట్లతో చాలా బాగా నిజాం సాగర్ ను నిర్మించారు. ఐతే ఈ ప్రాజెక్ట్ లోని సగం కెపాసిటీకి సమానంగా మట్టి పేరుకుపోయింది. 1972 లో ఒకసారి రిపేర్ చేయించారు. దీంతో 30 టీఎంసీల కెపాసిటీ కి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ మట్టి పేరుకుపోవటంతో 11 టీఎంసీలు అయ్యింది. ఇప్పుడు 17 టీఎంసీల కెపాసిటీ ఉంది. దీంతో నీళ్లను స్టోర్ చేసుకోలేని పరిస్థితి వచ్చింది. వర్షం ద్వారా వచ్చిన నీళ్లను వచ్చినట్లు గేట్లు ఎత్తి పంపించటం జరుగుతుంది.

ఈ ప్రాజెక్ట్ కు ఎక్స్ టెన్షన్ గా అలీసాగర్ ప్రాజెక్ట్ ను కూడా నిర్మించుకున్నాం. ఒరిజినల్ గా 3 లక్షల ఎకరాలకు నీళ్లు రావాల్సి ఉంది. కానీ అన్ని ఎకరాలకు నీళ్లు రావటం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్ట్ లలో మట్టి పూడికను తీసే కార్యక్రమం పెట్టుకుంది. నిజాం సాగర్ లో కూడా పేరుకుపోయిన మట్టిని వెంటనే తీసేయించాలి. ఆ మట్టిని కమర్షియల్ గా కాకుండా రైతులకు ఇవ్వాలి. గ్రామాలను బలోపేతం చేయాలి. అది సాధ్యమైతదా కాదా అన్న డీపీఆర్ ను ప్రభుత్వం వెంటనే తయారు చేయాలి. మట్టి పేరుకుపోవటంతో ఎల్లారెడ్డిపేటలోని కొన్ని గ్రామాలు మునిగిపోతున్నాయి. మొన్నటి వర్షాలకు ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ మెదక్ లో పాపన్న పేట వరకు వెళ్లిన పరిస్థితి. బ్యాక్ వాటర్ కారణంగా దాదాపు 4 వేల ఎకరాల పంటల నష్టం జరిగింది. అయిన సరే ప్రభుత్వం కనీసం స్పందించటం లేదు. మన వారసత్వ సంపదను కాపాడుకొని భవిష్యత్ తరాలకు అందించాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వెంటనే నిజాం సాగర్ లో మట్టి పూడికను తీయాలి. మోడ్రనైజేషన్ పనులు చేపట్టాలి. బ్యాక్ వాటర్ కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి’’ అని అన్నారు.

