- పాలకులు, అధికారుల పట్టింపు కరువు
- మరమ్మతులకు నోచుకోని వైనం
- ప్రమాదాలకు గురవుతున్న వాహనదారులు
బాన్సువాడ, బతుకమ్మ : రోడ్డు మరమ్మతు పనుల ఆలస్యం కారణంగా ప్రజలు అవస్థలు పడుతున్నారు.కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో రహదారులన్నీ దెబ్బతిన్నాయి.ఎక్కడ చూసినా కంకర తేలి, గుంతలు పడి, బురదమయమైన దారులే కనిపిస్తున్నాయి. రోడ్లపై వర్షపు నీటితో నిండిన గుంతలు కుంటలను తలపిస్తున్నాయి.నిత్యం వేల సంఖ్యలో వాహనాలతో రద్దీగా ఉండే నిజామాబాద్ ప్రధాన రహదారి దెబ్బతిని గుంతలుగా మారాయి. ప్రమాదకరంగా ఉన్న ఆ రోడ్లపై వాహనాలల్లో ప్రజలు ప్రయాణం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇబ్బందులు ఎదుర్కొంటూనే బిక్కు బిక్కు మంటూ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ప్రయాణంలో సామాన్య ప్రజలే కాక గర్భిణీ స్త్రీలు, అత్యవసర పరిస్థితిలో అంబులెన్స్ డ్రైవర్లు సైతం ఈ రోడ్లపై తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఆ ప్రధాన రహదారులలోనే మోకాళ్ళలోతు గుంతలు.. వాటిని తప్పించే క్రమంలో ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారు.వాహనాల టైర్ల నుంచి కంకర రాళ్లు ఎగిరి పడుతుండడంతో పలువురు గాయాలపాలవుతున్నారు.ఈ దారిపై వెళ్లాలంటే ద్విచక్ర వాహనాదారులు సైతం భయాందోళన చెందుతున్నారు.రాత్రి వేళల్లో కంకర మీద ప్రయాణం చేయలేక ద్విచక్ర వాహన దారులు జారి పడి ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. మరోవైపు దుమ్ము, ధూళితో రహదారి వెంట ఉన్న పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రధాన రహదారులు మరమ్మతులు చేయాల్సిన అధికారులు, పాలకుల చోద్యం చూస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే రోడ్లు అద్వానంగా తయారైతున్నాయని.. ప్రయాణికులకు, ప్రజలకు నరకం చూపిస్తున్నారని ఆవేదన చెందారు. పెద్ద ప్రమాదాలు జరగకముందే పాలకులు, అధికారులు దృష్టి సాధించి రోడ్డు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
- ఏ రోడ్డు చూసినా అదే పరిస్థితి..
ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లాలంటే ఏ రోడ్డు చూసినా కంకర తేలడంతో పాటు గుంతల మయంగా మారింది. నిజామాబాద్, బాన్సువాడ,పిట్లం, బిచ్కుంద, ఎల్లారెడ్డి, నిజంసాగర్, కామారెడ్డి తో పాటు పలు మండలంల్లో అనేక గ్రామాల్లో ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా స్పందించి దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. ఆదిశగా అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

