. . . రికార్డు స్థాయిలో 5.68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
. . . 61,442 మంది రైతులకు రూ. 1162.18 కోట్ల బిల్లుల చెల్లింపులు
. . . కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
యాసంగి-2026 సీజన్ కు సంబంధించి వరి ధాన్యం సేకరణలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 5.68 లక్షల మెట్రిక్ టన్నుల పైచిలుకు వరి ధాన్యం సేకరణ పూర్తి చేశామని వివరించారు. కేవలం ఐదు శాతం మేరకు మిగిలి ఉన్న మరో 32,797 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సైతం వేగవంతంగా వారం రోజుల్లోపు కొనుగోళ్ళు పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నామని అన్నారు. కొనుగోలు కేంద్రాలలో ఎక్కడ కూడా లారీలు, హమాలీల కొరత తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని, రైస్ మిల్లుల వద్ద ధాన్యం అన్ లోడింగ్ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షణ జరుపుతున్నామని తెలిపారు. ఈ సీజన్ లో 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యం కాగా, 95 శాతం ధాన్యం సేకరణ పూర్తి చేశామని తెలిపారు. సేకరించిన ధాన్యం విలువ రూ. 1358.20 కోట్లు కాగా, అందులో 61,442 మంది రైతులకు వారి ఖాతాలలో రూ. 1162.18 కోట్ల బిల్లుల చెల్లింపులు పూర్తయ్యాయని కలెక్టర్ వివరించారు. ట్యాబ్ ఎంట్రీలలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే ఐదవ స్థానంలో ఉందని, కేవలం మరో 9శాతం ట్యాబ్ ఎంట్రీలు పూర్తికావాల్సి ఉందన్నారు. రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా వేగవంతంగా రైస్ మిల్లులకు చేరవేసే విషయంలోనూ నిజామాబాద్ జిల్లా అగ్రభాగాన ఉందని, మిల్లర్ల నుండి 96శాతం మేర ఎక్ నాలెడ్జ్ మెంట్ పూర్తయ్యిందని వివరించారు. ఎక్కడ కూడా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని అన్నారు. అన్ని కొనుగోలు కేంద్రాలలో సరిపడా గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయని, ధాన్యం లోడింగ్, అన్ లోడింగ్ కోసం సరిపడా హమాలీలు, వెంటదివెంట ధాన్యం రవాణా కోసం తగిన సంఖ్యలో లారీలను సమకూర్చడం జరిగిందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.
