24 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక అమలులో నిజామాబాద్ జిల్లా భేష్

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సమీక్ష సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి, జిల్లా స్పెషల్ ఆఫీసర్ యోగితారాణా

 

. . . ఇదే స్పూర్తితో ముందుకు సాగాలని అధికారులకు దిశానిర్దేశం

 

. . . ప్రభుత్వ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకునేలా చూడాలి

 

. . . ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అంకితభావంతో విధులు నిర్వర్తించాలి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ అమలులో నిజామాబాద్ జిల్లా పనితీరు ఎంతో భేషుగ్గా ఉందని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి, జిల్లా స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ యోగితారాణా ప్రశంసించారు. ఒక్కో శాఖ వారీగా ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలతో పాటు మానవీయ కోణంలో వినూత్న కార్యక్రమాలను అమలు చేయడం జరిగిందని, ఇకముందు కూడా ఇదే స్పూర్తితో పనిచేస్తూ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తేవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

 

Nizamabad District Excels in Implementing 'Praja Palana' and Development Plans

 

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన కాన్ఫరెన్స్ హాల్ లో గురువారం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించగా, రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి, జిల్లా స్పెషల్ ఆఫీసర్ యోగితారాణా విచ్చేశారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలో అమలు చేసిన కార్యక్రమాల గురించి కలెక్టర్ ఇలా త్రిపాఠి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేయగా, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమాల ప్రగతి నివేదికను తిలకించిన స్పెషల్ ఆఫీసర్ యోగితారాణా, జిల్లా కలెక్టర్ ను, ఆయా శాఖల అధికారులను అభినందించారు. జిల్లాలో ఒకే రోజు 3304 ఇందిరమ్మ గృహాలలో లబ్దిదారులచే సామూహిక గృహ ప్రవేశాలు చేయించడం, ప్రజా ప్రతినిధులు, ప్రజలను భాగస్వామ్యం చేస్తూ నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో విస్తృత స్థాయిలో శ్రమదానం నిర్వహించడం, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఆరోగ్య శిబిరాలు, స్పెషల్ క్యాంప్ లు చేపట్టడం, ట్రాన్స్ జెండర్ల సమస్య పరిష్కారానికి కలెక్టర్ మానవీయ కోణంలో చొరవ చూపుతూ కృషి చేయడం తదితర కార్యక్రమాలను నిర్వహించడం స్పూర్తిదాయకం అని అన్నారు. దీనిని నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని, ఆ దిశగా ఎంతో సమర్ధవంతులైన జిల్లా అధికారులు కృషి చేస్తూ, నిజామాబాద్ కు విశిష్ట గుర్తింపు తెస్తారనే నమ్మకం ఉందని అన్నారు. తాను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా కొనసాగిన సమయంలో ఉపాధి హామీ, ఈ-నామ్, హరితహారం తదితర కార్యక్రమాల అమలులో జిల్లా అధికారులు నిజామాబాద్ ను అగ్రభాగాన నిలిపారని, జాతీయ స్థాయిలో అవార్డులు వరించాయని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ఇదే తరహాలో కృషి చేస్తూ, జిల్లా యంత్రాంగం ప్రతిష్టను ఇనుమడింపజేయాలని అన్నారు.

 

Nizamabad District Excels in Implementing 'Praja Palana' and Development Plans

 

రాష్ట్ర ప్రభుత్వం అనేక వినూత్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోందని, ప్రజలకు పాలనను చేరువ చేసేందుకే ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికను ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని తెలిపారు. ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగా ప్రజలతో మమేకమై వారి సమస్యలను గుర్తించి పరిష్కరించడమే ధ్యేయంగా అధికారులు అంకిత భావంతో పని చేయాలని హితవు పలికారు. అర్హులైన ప్రతి ఒక్కరు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందేలా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ పథకాల అమలు తీరును రాష్ట్ర స్థాయిలో నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందని అన్నారు. విద్య, వైద్య రంగాలతో పాటు మహిళల సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, సోలార్ పవర్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, అద్దె బస్సుల నిర్వహణ వంటి కార్యక్రమాల ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతోందని తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, ఇతర మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత అధికార యంత్రాంగానిదేనని స్పష్టం చేశారు.

 

Nizamabad District Excels in Implementing 'Praja Palana' and Development Plans

 

రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని, ఆయా ప్రాంతాలలో మెరుగైన విద్యా విధానం గురించి అధ్యయనం చేసేందుకు ప్రత్యేకంగా ఉపాధ్యాయులతో కూడిన బృందాలను దేశ, విదేశాలకు సైతం పంపిందని గుర్తు చేశారు. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను సర్కారు బడులలో అందించేలా కోట్లాది రూపాయాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళను, తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళను నెలకొల్పుతోందని తెలిపారు. ఇందులో భాగంగానే జిల్లాలోని ఆర్మూర్, బోధన్, బాన్సువాడ నియోజకవర్గాలలో ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయని అన్నారు. దశల వారీగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో వచ్చే నాలుగు నెలలలో అల్పాహారం, మద్యాహ్న భోజనం అమలు లోకి వస్తుందని తెలిపారు. విద్యార్థులకు ఉచితంగా టెక్స్ట్ బుక్కులు, నోట్ బుక్కులు, యూనిఫారంలతో పాటు ఇతర సదుపాయాలను కూడా ప్రభుత్వం సమకురుస్తోందని వివరించారు. ఈ విషయాలను తల్లిదండ్రులకు తెలియజేస్తూ, ప్రభుత్వ బడుల పట్ల వారిలో నమ్మకాన్ని పెంపొందించేందుకు ఉపాధ్యాయులు, ఇతర అధికారులు సమిష్టిగా కృషి చేయాలని, ప్రభుత్వ బడులలో పెద్ద ఎత్తున విద్యార్థులు ప్రవేశాలు జరిగేలా చొరవ చూపాలని అన్నారు.

 

Nizamabad District Excels in Implementing 'Praja Palana' and Development Plans

 

ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 10 ప్రధాన అంశాలపై జిల్లాలో కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. పరిశుభ్రత, ఫైళ్ల పరిష్కారంలో భాగంగా అన్ని శాఖలలో పెండింగ్ ఫైళ్లు పరిష్కరించామని, అరైవ్–అలైవ్ కార్యక్రమంలో భాగంగా గ్రామపంచాయతీల్లో రోడ్డు భద్రత కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ధాన్యం సేకరణలో, రైతులకు బిల్లుల చెల్లింపుల్లో నిజామాబాద్ జిల్లా అగ్రభాగాన నిలిచిందని, కొత్త రేషన్ కార్డులు మంజూరు, మెగా జాబ్ మేళా ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు. బడిబాట కార్యక్రమం ద్వారా విద్యార్థులను ప్రభుత్వ బడులలో చేర్పించడం జరిగిందని, ఇతర వినూత కార్యక్రమాలను అమలు చేశామని కలెక్టర్ తెలిపారు. సమీక్షా సమావేశంలో  అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగ రావు, సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, అదనపు డీసీపీ శుభం నగ్రాలే, డీ.ఆర్.ఓ గీత, ట్రైనీ కలెక్టర్ సురేష్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఆర్డీఓలు రాజేంద్ర కుమార్, విజయలక్ష్మి, ట్రైనీ ఆర్డీఓ సందీప్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

Nizamabad District Excels in Implementing 'Praja Palana' and Development Plans

More articles

Latest article