. . . ఏఐటీయూసి, టీయూసీఐ, సీఐటీయూ సంఘాల డిమాండ్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, సిఐజి గ్రూపులను యధావిధిగా కొనసాగించాలని, ఏజెన్సీ కార్మికులతో కొత్త గ్రూపులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటియుసి, సిఐటియు, టీయుసీఐ సంఘాల నాయకులు మున్సిపల్ కమిషనర్ ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ఓమయ్య, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ.రమేష్ బాబు, టియుసిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ లు మాట్లాడుతూ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య విభాగంలో ఔట్సోర్సింగ్ కార్మికులతో ఇప్పటికే కామన్ ఇంట్రెస్ట్ గ్రూపులు (సిఐజి) ఉన్నాయన్నారు. ఇవి కాకుండా ఔట్సోర్సింగ్ ఏజెన్సీలో 330 మంది కార్మికులు ఉన్నారన్నారు. వాటర్ వర్క్స్ కార్మికులు డ్రైవర్లు సిఐజి గ్రూపుల్లో లేరన్నారు. వీరిని మాత్రమే కొత్తగా గ్రూపులుగా చేయాలన్నారు. ఇప్పటికే ఉన్న సిఐజి గ్రూపులను రద్దుచేసి కొత్త గ్రూపులు ఏర్పాటు చేయాలనుకోవడం సరైంది కాదన్నారు. అందువల్ల పనిభారం పెరుగుతుందని, ఇప్పటికే ఉన్న సిఐజి గ్రూపులను కొనసాగిస్తూ, అవుట్సోర్సింగ్ ఏజెన్సీ 330 మంది, వాటర్ వర్క్స్ కార్మికులను 25 నుండి 35 మందితో ఒక గ్రూపుగా ఏర్పాటు చేయాలన్నారు. పాత సిఐజి గ్రూపులను కదపాలని చూస్తే ఆందోళనలకు పూనుకుంటామన్నారు. అదేవిధంగా ఔట్సోర్సింగ్ కార్మికులందరికీ యూనిఫామ్, సబ్బులు, నూనెలు, రక్షణ పరికరాలు ఇవ్వాలని, కేటగిరీల వారీగా ఇతర మున్సిపల్ కార్పొరేషన్ లో ఇస్తున్నట్లు వేతనాలు చెల్లించాలని, పిఎఫ్ ఈఎస్ఐలలో ఉన్న తప్పులను సరిదిద్దాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టియుసిఐ జిల్లా నాయకులు కిరణ్, లింగం, భానుచందర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
