. . . రెండు ఎకరాలు ఎవరికి సరిపోతాయి
. . . ఎమ్మెల్యే సంజయ్ కి కనీస పరిజ్ఞానం లేదు
. . . ఇక నుండి నా దృష్టంతా జగిత్యాల రాజకీయాలపైనే : ఎంపీ అర్వింద్
జగిత్యాల, బతుకమ్మ :
జగిత్యాల జిల్లా చచల్గల్ శివారులో కేంద్రీయ విద్యాలయం కోసం కేవలం రెండు ఎకరాల భూమి కేటాయించడం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అవివేకానికి నిదర్శనమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్రస్థాయిలో విమర్శించారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం కనీసం ఐదు ఎకరాల భూమి అవసరమనే సాధారణ పరిజ్ఞానం కూడా ఎమ్మెల్యేకు లేదని మండిపడ్డారు. నువ్వు ఇచ్చిన రెండు ఎకరాలను కేంద్రీయ విద్యాలయ సంఘటన్ తిరస్కరిస్తుందన్నారు. టి ఆర్ నగర్, ఐటిఐ లతో పాటు పనికిరాని ప్రదేశాల్లో కేంద్రీయ విద్యాలయానికి భూమి ఇస్తామని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని ఆరోపించారు. ఐటిఐ వాళ్ళే అక్కడ కనీస సౌకర్యాలు లేవని మొత్తుకుంటున్నారని, ఆ జాగా తీసుకొని ఏం చేయాలన్నారు? వ్యక్తిగత డబ్బుల గురించి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, కోరుట్ల అసెంబ్లీ ఎన్నికల్లో కావాలనే ఖర్చు పెట్టలేదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాలలో బీజేపీ అభ్యర్థిగా బోగ శ్రావణి నిలబడ్డా, ఇంకెవరిని నిలబెట్టినా వారి ఎన్నికల ఖర్చును తానే భరిస్తానని స్పష్టం చేశారు. రేపటి నుండి తాను జగిత్యాల వాడినని, కొన్ని రోజులు నిజామాబాద్ మీద దృష్టి తగ్గించి, జగిత్యాల రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి పెడతానని ప్రకటించిన ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రాజకీయ జీవితాన్ని ఖతం చేస్తానంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
