. . . జీజీహెచ్ లో మౌలిక వసతులపై మంత్రికి వినతి…
. . . ఆర్ వోబీ..ఆర్ యూబీ..నిర్మాణం, బస్ స్టాండ్ ఆధునికీకరణ కోసం మంత్రులను కలిశా…
. . . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ…
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నగర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా తన ప్రతి అడుగు ఉంటుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్ళు గడిచినా..నియోజకవర్గ అభివృద్ధి కోసం నయాపైసా ఇవ్వడం లేదన్నారు. నగర మేయర్, కార్పొరేషన్ కమిషనర్ ర్ నగరంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఓటమి చెందిన వారికి నిధులు ఇస్తున్నారు తప్ప, ప్రస్తుత ప్రజా ప్రతినిధులకు ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. గతంలో అనేక సార్లు ఆయా శాఖల మంత్రులను కలవడం జరిగిందని గుర్తు చేశారు. నగర అభివృద్ధి కోసం మళ్లీ నలుగురు మంత్రాన్ని కలవడం జరిగిందన్నారు. ప్రధానంగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ను కలిసి పలు అంశాలపై వినతి అందజేశానన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు పెరుగుతోందని, దీనికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా రూ.100 కోట్లతో నాందేవాడ, దేవి రోడ్డు, రైల్వే స్టేషన్ అదనపు వంతెన నిర్మించాలని ప్రతిపాదించినట్లు చెప్పారు. అలాగే రూ.70 కోట్లతో ఎల్లమ్మ గుట్ట రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరానన్నారు. అలాగే వర్ని, నిజామాబాద్, డిచ్పల్లి, ఇందల్వాయి, భీమ్గల్ కమ్మర్పల్లి వరకు నగరం మీదుగా 107 కిలోమీటర్ల కొత్త జాతీయ రహదారి ప్రతిపాదనలు కూడా అందించినట్లు పేర్కొన్నారు. నగరంలోని రేడియో స్టేషన్ నుంచి ముదక్పల్లి వరకు రోడ్లు భవనాల రహదారి అభివృద్ధి కూడా అవసరమని వివరించినట్లు పేర్కొన్నారు. ఇందూరులోని టీ హబ్ ద్వారా యువతకు ప్రముఖ ఎంఎన్ సీ కంపెనీలు తీసుకురావాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు కలిసినట్లు చెప్పారు. ఇందూరు యువతలో ప్రతిభకు కొదవలేదని, ఉద్యోగ అవకాశాల కోసం హైదరాబాద్, బెంగళూరు, పూణే వంటి నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. యువతను నగరాలకు పంపడం కాదని, ఉద్యోగాలను నిజామాబాద్ కే తీసుకురావాలని అన్నారు. జిల్లా జనరల్ ఆస్పత్రి సమస్యలను సమగ్రంగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గారిని కలిసి వివరించినట్లు తెలిపారు. ఎమ్మారై యంత్రం ఇప్పటికీ లేకపోవడం, మార్చురీ ఫ్రీజర్ల కొరత, లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ లేకపోవడం ప్రధాన సమస్యలన్నారు. అలాగే సివిల్ సర్జన్, ఆర్ ఎంఓ లు, క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ల ఖాళీలు భర్తీ చేయాలని కోరారు. పేదల ప్రాణాలను కాపాడే ఆసుపత్రిలో సౌకర్యాల కొరత ఉండకూడదని, ప్రజల ఆరోగ్యం పై రాజీపడే పరిస్థితి ఎప్పుడు ఉండకూడదు అన్నారు. తెలంగాణలోని ప్రధాన నగరాల్లో ఒకటైన నిజామాబాదు బస్టాండులో పెరిగిన రద్దీకి తగిన సౌకర్యాలు లేకపోవడం శోషనీయమని అన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి అందజేసినట్లు చెప్పారు. గతంలో స్థలానికి సంబంధించి వినతి పత్రం కూడా అందజేసినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న బస్టాండ్కు విశాలమైన వేచి ఉండే హాలు, సిట్టింగ్ కెపాసిటీ పెంపు, డిజిటల్ బస్సు ఇన్ఫర్మేషన్ బోర్డులు, ఎల్ఈడి స్క్రీన్లు, సీసీ కెమెరాలు, పార్కింగ్ సదుపాయం పరిశుభ్రత వంటి అంశాలపై వినతి పత్రం అందజేసినట్లు పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంతో నిజామాబాద్ అభివృద్ధిని వేగవంతం చేయాలన్నదే తన ప్రయత్నమని అర్బన్ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇందుకోసం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారితో కలిసి రైల్వే శాఖకు సంబంధించిన అనేక ప్రతిపాదనలు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు అందజేసినట్లు చెప్పారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి 19వ డివిజన్ కార్పొరేటర్ నాగోల్ల లక్ష్మీనారాయణ, పోతన్కర్ లక్ష్మీ నారాయణ, ఫ్లోర్ లీడర్ ప్రమోద్, కార్పొరేటర్లు బెల్లాల్ శశాంక్, జ్యోతి మురళి, శ్యామల సత్యపాల్, బొబ్బిలి సువర్ణ వేణుగోపాల్, బంటు ప్రీతి ప్రవీణ్, ప్రసూన శ్రీనివాస్, ఇప్పకాయల సుమిత్ర కిషోర్, పసునూరి రాము, బట్టు రాఘవేందర్, ఎస్సీ మోర్చ నాయకులు జస్పాల్ సింగ్, బాబీ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

