25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఆటో కోసం కొడుకును అమ్మేసిన తల్లి

Must read

📰 Generate e-Paper Clip

– సహజీవనం చేస్తున్న వ్యక్తి కోసం కన్న పేగును దూరం చేసుకున్న వైనం
– కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘటన
కామారెడ్డి, బతుకమ్మ: సహజీవనం చేస్తున్న వ్యక్తికి ఆటో కొనిచ్చేందుకు కన్న కొడుకును అమ్మేసింది ఓ తల్లి. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. కామారెడ్డికి చెందిన బూస లావణ్యకు నర్సింలు అనే వ్యక్తితో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక బాబు, పాప ఉన్నారు. కొంత కాలం క్రితం నర్సింలు అనారోగ్యంతో మృతి చెందగా.. లావణ్య స్థానికంగా ఓ బట్టల దుకాణంలో పనిచేస్తూ పిల్లలను పోషిస్తోంది. ఈ క్రమంలో లింగంపేట మండలం పర్మళ్ళ గ్రామానికి చెందిన చాకలి సాయిలు అనే వ్యక్తితో లావణ్యకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసి సాయిలు భార్య అతడిని వదిలేసి వెళ్లిపోవడంతో లావణ్య, సాయిలు కూలీ పనుల చేస్తూ సహజీవనం సాగిస్తున్నారు. అయితే ఆదాయం సరిపోవడం లేదని, ఉపాధి కోసం ఆటో కొందామని ప్లాన్ వేశారు. ఇందుకు డబ్బులు లేకపోవడంతో లావణ్య తన కొడుకు నిఖిల్(5)ను విక్రయించేందుకు సిద్ధమైంది. పర్మళ్ళ గ్రామానికి చెందిన నసీమా అనే మహిళకు రూ.50 వేలకు బాలుడిని విక్రయించింది. నసీమా ఆ బాలుడిని తన చెల్లి షహీదాకు ఇవ్వగా..షహీదా ఆ బాలుడిని రూ. లక్షకి శేఖర్ అనే వ్యక్తికి విక్రయించింది. ఈ విషయం తెలుసుకున్న చైల్డ్ వెల్ఫేర్  అధికారులు బాలుడిని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించి లావణ్య, సాయిలు, నసీమా, షహీదా, శేఖర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

More articles

Latest article