- పెంటకుర్థు గ్రామంలో ఘటన
- స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదుతో వెలుగులోకి
- పంచాయతీ కార్యదర్శి తో పాటు పారిశుద్ధ్య కార్మికులు, గ్రామస్తులపై కేసు
- ఖననం చేసిన కుక్కలకు పోస్టుమార్టం
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా బోధన్ పెంటకుర్ధు క్యాంపు గ్రామంలో దారుణం జరిగింది. గ్రామంలో పలువురు వ్యక్తులను గ్రామ సింహాల కరవడం తో గ్రామస్తులు తీవ్ర నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. గ్రామంలో సుమారు 50 మంది వరకు కరవడంతో 100 కు పైగా వీధి కుక్కలను గ్రామస్తులు తలా కొంత చందాలు వేసుకొని చంపినట్లు తెలిసింది. చనిపోయిన వాటిలో రెండు, మూడు పెంపుడు కుక్కలు ఉండడం తో వారు కరీంనగర్ కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది.
తరుచూ వీధి కుక్కల దాడులతో విసిగిపోయిన గ్రామస్తులు, కుక్కలను హత మార్చేందుకు విష ప్రయోగం చేసి చంపినట్టు తెలిసింది. కరీంనగర్ కు చెందిన ఓ ఎన్జీవోల కంప్లైంట్ తో కదిలిన బోధన్ రూరల్ పోలీసులు గ్రామపంచాయతీ కార్యదర్శి తో పాటు గ్రామ పారిశుద్ధ్య కార్మికులపై, గ్రామస్తులపై కేసులు నమోదు చేసినట్టు తెలిసింది. అదే గ్రామంలో వీధి కుక్కలకు పోస్టుమార్టం నిర్వహించారు. సంబంధిత పోస్ట్మార్టంలో భాగంగా శాంపిల్లను సేకరించి హైదరాబాదులోని రెడ్ హిల్స్ లో గల ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపినట్టు తెలిసింది. సంబంధిత వీధి కుక్కల చంపివేత ఘటన విషయం బయటకి పొక్కడంతో గ్రామస్తులంతా ఏకతాటిపైకి వచ్చినట్టు తెలిసింది. స్వచ్ఛంద సంస్థ నిర్వాకులు గౌతం అండ్ టీం పెంట కుర్దు గ్రామానికి వచ్చేందుకు యత్నించగా పోలీసులు వారించినట్టు తెలిసింది. గ్రామస్తులంతా ఆగ్రహంగా ఉన్నారని రక్షణ కల్పించలేమని చేతులెత్తేసినట్టు సమాచారం.
- మూగ జీవల సామూహిక హననం..
విషయం తెలుసుకున్న నాగార్జున భార్య, బ్లూ క్రాస్ సభ్యురాలు అమల రెండు రోజుల్లో గ్రామానికి రానున్నట్లు సమాచారం. గతంలోనూ ఒకసారి ఆర్మూర్ డివిజన్లోని ఒక గ్రామంలో కుక్కల సామూహిక హతంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారించిన దాఖలాలు ఉన్నాయి. అయితే ఈ కేసులో స్థానిక గ్రామస్తుల ఫిర్యాదు నేపథ్యం లో కేసును వెనక్కి తీసుకునేలా ఒత్తిడిలు పెరిగినట్టు తెలిసింది. అందుకే గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ వ్యవహారం బయటకి పొక్కకుండా ఉండేందుకు అన్ని శక్తులు శాయశక్తులా ప్రయత్నించినట్టు తెలిసింది. ఇప్పటికే వీధి కుక్కల కాటుతో చాలామంది మరణాలతో పాటు వాటి నియంత్రణ విషయంలో అధికార యంత్రాంగాలు విఫలమవుతుండడంతో ఈ వ్యవహారం బయటకి వస్తే తమకు చెడ్డ పేరు అని కేసును తొక్కి పెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి.
