- బతుకమ్మ ఎఫెక్ట్
- ఏఈలు తీసుకున్నవి వెనక్కి
- నాయక్ లకు ఇచ్చినవి జేబులకే
ఆర్మూర్ బతుకమ్మ : ఆర్మూర్ డివిజన్లోని విద్యుత్ శాఖలో బదిలీ అయినవారికి సన్మానం చేస్తామని నాలుగు సెక్షన్లలో జమ చేసిన డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్నట్లు తెలిసింది. యూనియన్ నాయకుల స్వార్థపూరిత ఆలోచనలతో ఏడీఈ నుంచి జేఎల్ఎం వరకు నిర్ణయించిన ప్రకారం చెల్లించాల్సిందేనని హుకుం జారీ చేశారు. బలవంతంగా డబ్బులు లాగుతున్న విషయం బతుకమ్మ దృష్టికి వచ్చింది. ఇదే విషయమై ‘సన్మానం కోసం బలవంతపు వసూళ్లు` అనే కథనాన్ని ప్రచురించింది. దీంతో దిగి వచ్చిన ఏఈ లు వారికి తిరిగి ఇచ్చేందుకు సంసిద్ధులయ్యారు. నాయకులకు ఇచ్చినవి రావడం కష్టమేనని మాటలు వినబడుతున్నాయి.
ఏఈలు ఇచ్చేస్తున్నారు…
ఆర్మూర్ డివిజన్ పరిధిలోని నాలుగు సెక్షన్ లలో కిందిస్థాయి సిబ్బంది దగ్గర నాయకులు నిర్దేశించిన ప్రకారం హోదాను బట్టి వసూలు చేశారు. బదిలీ అయినా డిఈఈ వల్ల లాభపడ్డ వారు ఏఈ లకు ఇవ్వగా, ఇంకొందరు ముక్కుతూ,ములుగుతూ ఇచ్చారు. సన్మానానికి డబ్బులు కావాలంట సిబ్బంది నుంచి ఇవ్వాలని ఒక సెక్షన్ లో లైన్ ఇన్స్పెక్టర్ కు ఏఈ సూచించారు. ఆ అధికారి వల్ల తమకు ఒరిగిందేమీ లేదని, ఇన్నేళ్లుగా లేనిది కొత్తగా సన్మానాలు ఏంటని ఎదురు ప్రశ్నించడమే కాకుండా తాను ఇవ్వలేనని కరాకండిగా చెప్పినట్లు తెలిసింది. ఇంకో సెక్షన్లో సగానికి పైగా సిబ్బంది నుంచి డబ్బులు తీసుకున్నారు సన్మానం అనేది మంచి కార్యక్రమం…ఇది చేద్దామని పైసలు అడుగితే దీనిపై పత్రిక వాళ్లకు సమాచారం ఇస్తున్నారని ఏఈతో ఒక నాయకుడు సంభాషించుకోవడం చూస్తే అధికారులు, యూనియన్ నాయకులు కుమ్మక్కైనట్లుగా ఉద్యోగులు పరిగణిస్తున్నారు.
నాయకులు ఇచ్చేనా..?
యూనియన్ నాయకుల దృష్టిలో పడడం కోసం కొందరు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ఆ ఉద్యోగినే కాకుండా తన దగ్గర సిబ్బంది నుంచి జమచేసి నాయకుల చేతిలో పెట్టారు. సన్మానం కోసం డబ్బులు జమ చేస్తున్నారనే విషయం బతుకమ్మ పత్రిక వల్ల సర్కిల్లోనే గాకుండా, కంపనీ సిఎండి దగ్గరకు వెళ్లడంతో మూలకారకులందరూ కుదేలైపోయారు. నాయకులతో చేయి కలిపితే కొంత లాభం ఉంటుందని ఆశపడ్డ ఏఈలకు ముచ్చెమ్మటలు పట్టాయి. వీరి వల్ల ఉద్యోగానికే ఎసరు వచ్చేలా ఉందని ఇచ్చినవారికి తిరిగి ఇచ్చేస్తున్నారు. నాయకులకు ఇచ్చినవి తిరిగి రావడం కష్టతరమేనని మదన పడుతున్నారు. అన్నా..మొన్న సన్మానం కోసం ఇచ్చిన డబ్బులు ఇస్తారా అని అడిగితే సరే ఇస్తానని వెటకారంగా చెప్పడమే కాకుండా పరోక్షంగా ప్రతికారం తీర్చుకుంటారనే భయం నాయకులకు ఇచ్చిన వారిలో నెలకొంది. నలుగురిని వెంటేసుకొని తిరగడమేగాని, నమ్ముకున్న వారికి న్యాయం చేయలేని దౌర్భాగ్య స్థితిలో యూనియన్ నాయకులు ఉన్నారనే ఏవగింపు మాటలు డివిజన్ సిబ్బంది నుంచి వినబడుతున్నాయి.
