. . . 70.42 శాతం గ్రాడ్యూయేట్ పోలింగ్
. . . 91.90 శాతం ఓట్లు వేసిన ఉపాధ్యాయులు
నిజామాబాద్, బతుకమ్మ:
కరీంగనర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కొన్ని ప్రాంతాల్లో అప్పటికే పోలింగ్ కేంద్రాల్లో ఉన్నవారికి అదనంగా సమయం ఇవ్వడంతో ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.
నాలుగు పాత జిల్లాల పరిధిలో 3,55,159 మంది పట్టభద్రుల ఓటర్లు గాను 2,50,106 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం గా 70.42 నమోదైంది.. కరీంనగర్ జిల్లాలో అత్యల్పంగా పట్టభధ్రుల 64.64 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకోగా అత్యధికంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 79.50 శాతం మంది ఓట్లు వేశారు. నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో టీచర్స్ ఎమ్మెల్సీ కోసం 27,088 మంది ఓటర్లకు గాను 24,895 ఓటు హక్కును వినియోగించుకొని 91,90 పోలింగ్ శాతం నమోదైంది. నిర్మల్ జిల్లాలో 82.10 శాతం మంది ఉపాధ్యాయులు అత్యల్పంగా, సిద్ధిపేట్ జిల్లాలో అత్యధికంగా 95.03 శాతం టీచర్స్ ఓట్లు వేశారు.
నిజామాబాద్ జిల్లాలో గ్రాడ్యూయేట్ ఓటర్లు 31,574 మందికి గాను 24,388 మంది ఓటు హక్కును వినియోగించు కోగా 77.24 శాతం పోలింగ్ నమోదైంది. టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి గాను 3751 మందికి గాను 3468 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కును వినియోగించుకోగా 92.46 శాతం మంది ఓట్లు వేశారు. కామారెడ్డి జిల్లాలో 2011 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉండగా 1883 మంది ఓటు హక్కును వినియోగించుకోగా 93.63 గా పోలింగ్ శాతం రికార్డయింది. కామారెడ్డి జిల్లాలో 16410 మంది గ్రాడ్యూయేట్ లకు గాను 12820 మంది ఓటు హక్కును వినియోగించుకోగా 78.12 శాతంగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు.

నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కామారెడ్డి కలెక్టర్ అశీష్ సంగ్వాన్ లు ఇతర అధికారులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే వేంకట రమణా రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే కాంతారావు తమ పట్టభద్రుల ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు ఉన్నారు. గురువారం రాత్రి పోలింగ్ కు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు జిల్లా కేంద్రాలకు తరలించారు. మార్చి 3న ఫలితాలు వెలువడనున్నాయి.

