- చర్యలకు బదులు రాజీలు
- అధికారుల తీరుపై గ్రామస్తుల ఆగ్రహం
బతుకమ్మ, కోటగిరి : వాటర్ ట్యాంకులు తొలగించి ఇసుక ర్యాంపుకై తరలింపు అనే కథనానికి స్పందన లభించింది. కొడిచెర్ల గ్రామంలో మంచినీళ్ల ట్యాంకులను ఇసుక ర్యాంపు కోసం తరలించిన ఘటన పై అధికారులు స్పందించారు. మిషన్ భగీరథ డీఈ మున్ని నాయక్ శుక్రవారం గ్రామంలో పర్యటించి పరిస్థితి పై ఆరా తీశారు. ట్యాంకులను తొలగించిన వారి వివరాలు తెలుసుకొని స్థానిక ఎంపీడీవోతో కలిసి వారితో మాట్లాడారు. ట్యాంకులను తొలగించిన విషయాన్ని వారు ఒప్పుకొని ఆ ట్యాంకుల స్థానంలో కొత్త ట్యాంకులు నిర్మించి ఇచ్చేందుకు తమకు వారం సమయం ఇవ్వాలని కోరారని అధికారులు తెలిపారు. పాత ట్యాంకులను తీసిన చోట వారంలోపు కొత్త ట్యాంకులు నిర్మిస్తామని అధికారులు తెలిపారు. వాటర్ ట్యాంకులను తొలగించిన వారిపై చర్యలు తీసుకోకుండా కొత్త ట్యాంకులను ఏర్పాటు చేస్తే సరిపోతుందని చెప్పడంతో అధికారుల ఎలాంటి చర్యలు తీసుకోకుండా రాజీ పడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమంగా వాటర్ ట్యాంకులను తొలగించిన అధికార యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో ఆకతాయి ఆగడాలు ఎక్కువైతాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చందర్, మిషన్ భగీరథ ఏఈ ధనరాజ్ గ్రామస్తులు ఉన్నారు.
