నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మల్కాపూర్ లో
బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి శుక్రవారం మొరం క్వారీలను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూముల్లో అక్రమ మొరం తవ్వకాలు జరుగుతున్నాయని,
ఈ దందాకు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ప్రోత్సాహం ఉందని ఆరోపించారు. ప్రభుత్వం ప్రజల కోసం భూములు కేటాయించిందని, కాంగ్రెస్ నేతలు దోపిడీకి దిగారని ఆరోపించారు. మల్కాపూర్, జాన్కంపేట్, ప్రాంతాల్లో మొరం మాఫియా రెచ్చిపోతుందన్నారు. రోడ్డుపై వందలాది టిప్పర్లు తిరుగుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని చెప్పారు. రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి లేక అవినీతి మాత్రం పెరిగిపోయిందన్నారు. ఇన్ చార్జి మంత్రులు కేవలం ఫోటోలు, ప్రకటనలకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి క్వారీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన, ధర్నాలు, కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. అధికారులు ప్రజల పక్షాన ఉండాలని హితవు పలికారు. ఒక అధికారి “ఎంఎల్ఏ చెప్తేనే పర్మిషన్ ఇస్తా” అని చెప్పడం సిగ్గుచేటు అని దుయ్యబట్టారు. అధికారుల అనుమతితో అవినీతి నడుస్తుంటే ప్రజాస్వామ్యం దెబ్బతింటుందన్నారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ ఆడియో కాల్‌ను మీడియా ముందు విడుదల చేశారు. దానిపై విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూపతి రెడ్డి వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని దినేష్ పటేల్ డిమాండ్ చేశారు. ప్రజల హక్కుల కోసం భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ వెనక్కి తగ్గదన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని పేదలను బెదిరించాలని చూస్తే ఊరుకోబోమని దినేష్ పటేల్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో రూరల్ కన్వీనర్ పద్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు రాంచందర్,శంకర్ రెడ్డి,మండల అధ్యక్షులు ఆనంద్,కూరెళ్ల శ్రీధర్,నాయిడి రాజన్న, గోపి, ఓం సింగ్,యాదల నరేష్,అమందు విజయ్ కృష్ణ, వినోద్ రెడ్డి, శ్రీధర్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు
రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆశీర్వాదంతో మైనింగ్ దందా
